logo

ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు.. భారీగా పెరగనున్న హెచ్‌ఎండీఏ పరిధి

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధి భారీగా పెరగనుంది. ప్రాంతీయ రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. కొత్తగా అనేక ప్రాంతాలు ఇందులోకి రానున్నాయి.

Updated : 29 Feb 2024 08:51 IST

రాజధాని నగరంతో 20 చిన్న పట్టణాలకు అనుసంధానం

 ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధి భారీగా పెరగనుంది. ప్రాంతీయ రింగ్‌రోడ్డు లోపలి ప్రాంతాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. కొత్తగా అనేక ప్రాంతాలు ఇందులోకి రానున్నాయి. ఫలితంగా క్రమపద్ధతితో కూడిన అభివృద్ధికి ఆస్కారం ఏర్పడనుంది. 2008 ఆగస్టు 25న హెచ్‌ఎండీఏ ఏర్పాటైంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, భువనగిరి, మెదక్‌, సిద్దిపేట్‌ జిల్లాల్లోని 70 మండలాలు, 1032 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా హెచ్‌ఎండీఏతో అనుసంధానమై ఉన్నాయి. మొత్తం పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు.. తాజాగా ప్రాంతీయ రింగ్‌రోడ్డులోని లోపల ప్రాంతాల వరకు విస్తరించనుండటంతో దీని పరిధి మరింత పెరగనుంది. ఈ ప్రక్రియ దశలవారీగా జరగనుంది.

 పైవంతెనలు, అనుసంధాన రోడ్లు

ఆయా జిల్లాల్లోని భారీ భవంతులు, లేఅవుట్లకు హెచ్‌ఎండీఏ అనుమతులు ఇస్తోంది. ఈ క్రమంలో అవసరమైన చోట ఫ్లైఓవర్లు, అనుసంధాన రోడ్లు చేపడుతుంది. తాజాగా పరిధిని ఆర్‌ఆర్‌ఆర్‌కు పెంచనుండటంతో మహానగరంతో దాదాపు మరో 20 చిన్న పట్టణాలకు అనుసంధానం కలుగుతుంది. ఇప్పటికే ఔటర్‌ వరకు అర్బన్‌, తర్వాత పెరీఅర్బన్‌, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరించనుండటంతో భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. మొత్తం 340 కి.మీ.మేర ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధిలోకి వచ్చే తూప్రాన్‌, ములుగు, భువనగిరి, మల్కాపూర్‌, ఆగపల్లి, కొత్తూరు, షాద్‌నగర్‌, చేవెళ్ల, కౌలంపేట్‌, నర్సాపూర్‌, చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, ఆమనగల్‌, షాద్‌నగర్‌, శంకర్‌పల్లి, కంది, సంగారెడ్డి వరకు హెచ్‌ఎండీఏ విస్తరించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలంగాణతో అనుసంధానమైన అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి. ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు రేడియల్‌ రోడ్లు, గ్రిడ్‌ రోడ్ల అభివృద్ధికి సైతం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ట్రక్‌పార్కులు లాంటివి ఈ రెండు రహదారుల చుట్టూ విస్తరించనున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎండీఏలో ఉన్న సిబ్బంది సంఖ్య చాలక పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరో 340 కి.మీ. వరకు పరిధి పెరిగితే అదనపు సిబ్బంది అవసరం అవుతారు. దీనికి కూడా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని