logo

తియ్యని విషం

పేరుకే అంతర్జాతీయ సంస్థ. తయారుచేసిన చాక్లెట్లకు మాత్రం ఆస్థాయి లేదు. నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల తాజాగా ఇచ్చిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Updated : 29 Feb 2024 09:43 IST

‘తెల్ల పురుగు’ నమూనాపై ప్రయోగశాల నివేదిక

నాసిరకం బట్టర్‌, మయో, సాస్‌లపైనా ఫిర్యాదులు

కల్తీ నియంత్రణలో జీహెచ్‌ఎంసీ  నిర్లక్ష్యం

 

ఈనాడు, హైదరాబాద్‌: పేరుకే అంతర్జాతీయ సంస్థ. తయారుచేసిన చాక్లెట్లకు మాత్రం ఆస్థాయి లేదు. నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల తాజాగా ఇచ్చిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. చాక్లెట్‌ నమూనాను పరీక్షించిన నిపుణులు.. అవి తినేందుకు పనికిరావని తేల్చి చెప్పారు. ఈ నెల 12న అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌లో ఓ చాక్లెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి.. అందులో తెల్లని పురుగును గుర్తించాడు. వాటి నమూనా పరీక్ష ఫలితం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదే మాదిరి.. నగరంలో నాసిరకం వెన్న ముద్దలు, మయోనీజ్‌, అల్లం వెల్లుల్లి మిశ్రమం, సాస్‌లు, ఇతరత్రా పదార్థాలు తయారవుతున్నాయని జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలొస్తున్నాయి. నగర ఆహార భద్రత నియంత్రణాధికారుల(ఎఫ్‌ఎస్‌ఓ) నిర్లక్ష్యంతోనే కల్తీ ఆహారం విస్తరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని పదార్థాలపై..: బట్టర్‌.. ఏ వయసు వారైనా అన్ని వేళలా తినగలిగే ఇడ్లీ పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. బట్టర్‌ ఇడ్లీ పేరుతో.. కొందరు వ్యాపారులు ఇడ్లీలను నాసిరకం వెన్నతో ముంచెత్తుతున్నారు. నగరవాసులు ఆప్యాయంగా తినే బిర్యానీలో, మాంసాహార వంటకాల్లో, పిజ్జాలు, బర్గర్‌లు, రొట్టెలు, ఇతరత్రా ఆహార పదార్థాల్లోనూ బట్టర్‌ దట్టించడం సాధారణమైంది. ఇటీవల ఆ విషయమై ఫిర్యాదులు వస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఆహార విభాగం అధికారి ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు.
మయో.. మయోనీజ్‌ను ముద్దుగా మయో అని పిలుస్తారు. కోడిగుడ్డు, నూనె, ఇతర వస్తువులతో ఆ పదార్థం తయారవుతుంది. కొందరు వ్యాపారులు అపరిశుభ్రతమధ్య తయారుచేస్తుండటంతో విషంలా మారుతుంది. ప్రతినెలా మయోనీజ్‌ తిని వాంతులు, విరేచనాలయ్యాయంటూ జీహెచ్‌ఎంసీకి కనీసం పది ఫిర్యాదులు అందుతుండటమే అందుకు నిదర్శనం.
కోవా.. తియ్యని మిఠాయిల్లో ఉపయోగించే కోవాను.. పాతబస్తీ, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, తదితర శివారు ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు ఆందోళనకర పద్ధతిలో తయారు చేస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఆరోగ్య విభాగం తనిఖీల్లో వెల్లడైంది.
రంగులు.. తందూరి చికెన్‌, చికెన్‌ 65, బిర్యానీ, చికెన్‌ ఫ్రైడ్‌ రైస్‌ వంటి ఆహార పదార్థాల్లో ఎర్రని రంగు మోతాదుకు మించి ఉపయోగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ పరీక్షల్లో తేలుతోంది. ఆయా నమూనాలను రాష్ట్ర ప్రయోగశాలలో పరీక్షించిన ప్రతిసారీ.. అనారోగ్యకరమని తేలుతున్నట్లు అధికారులు గుర్తుచేస్తున్నారు. బేకరీల్లోని లడ్డూలు, రంగుల మిఠాయిల్లోనూ విషం లాంటి రంగులను ఎక్కువగా కలుపుతున్నారని అధికారులు చెబుతున్నారు

చర్యలేవీ.. హోటళ్లు, ఇతర వ్యాపార కేంద్రాల్లోని తినుబండారాల తనిఖీలో జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పరీక్షించిన నమూనాల్లో నాసిరకం, అనారోగ్యకరంగా తేలిన ఆహార పదార్థాల విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవట్లేదు. కల్తీ జరిగిందని, పాచిపోయిన బిర్యానీ వడ్డించారని, కూరలో పురుగులున్నాయని వచ్చే ఫిర్యాదులను పట్టించుకోకుండా.. హోటళ్ల యజమానులతో కుమ్మక్కవుతున్నారనే ఫిర్యాదులున్నాయి.


కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ తయారీ ముఠా అరెస్టు

బేగంపేట, న్యూస్‌టుడే: నాసిరకం అల్లం, వెల్లుల్లి, రసాయనాలు, సిట్రిక్‌ యాసిడ్‌, రంగులు కలిపి ఆరోగ్యానికి హాని కలిగించే పేస్ట్‌ తయారు చేసి నగర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.5లక్షల విలువైన కల్తీ పేస్ట్‌, ముడి సరకుని స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన రహీం చరణీయ(36) జీవనోపాధి నిమిత్తం కొన్నేళ్ల కిందట నగరానికి వచ్చి బేగంపేటలో ఉంటున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు రాజేంద్రనగర్‌ సమీపంలోని ఉప్పర్‌పల్లిలో దక్కన్‌ ట్రేడర్స్‌ పేరిట కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. బేగంపేట పాటిగడ్డలో నివసించే పాండురంగారావు(72)ను ఏజెంట్‌గా నియమించి పేస్ట్‌ను బేగంపేటలో నిల్వ చేస్తూ అజయ్‌కుమార్‌ ఆహీర్‌(43), ప్రదీప్‌ సంక్లా(29)ల ద్వారా, నగరంలోని హోల్‌సేల్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంలో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రాజేంద్రనగర్‌లోని తయారీ కేంద్రం, పాటిగడ్డలోని నిల్వ కేంద్రం, బేగంబజార్‌లోని హోల్‌సేల్‌ దుకాణాలపై దాడి చేశారు. 700 కిలోల పేస్ట్‌, 625 కిలోల నాణ్యతలేని వెల్లుల్లి, 100 కిలోల నాసిరకం అల్లం, 150 కిలోల రాళ్ల ఉప్పు,  రసాయనాలు, రంగు డబ్బాలు, ప్యాకింగ్‌ యంత్రాలు, గ్రైండర్‌ వంటివి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను బేగంపేట పోలీసులకు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని