logo

హైదరాబాద్‌లో చిన్నారులకు స్కార్లెట్‌ జ్వరం

నగరంలోని పలు చిన్న పిల్లల ఆసుపత్రులకు స్కార్లెట్‌ జ్వర బాధితుల తాకిడి పెరుగుతోంది. ఒక వైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి ఇబ్బంది పెడుతోంది.

Updated : 01 Mar 2024 04:56 IST

ప్రతి 20 మంది జ్వర బాధితుల్లో 12 మంది వారే
5-15 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని పలు చిన్న పిల్లల ఆసుపత్రులకు స్కార్లెట్‌ జ్వర బాధితుల తాకిడి పెరుగుతోంది. ఒక వైపు పిల్లలకు పరీక్షలు ప్రారంభమైన సమయంలో ఈ వ్యాధి ఇబ్బంది పెడుతోంది. ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలోని పిల్లల విభాగానికి వస్తున్న 20 మంది జ్వర బాధితుల్లో 10-12 మందిలో ఈ స్కార్లెట్‌ లక్షణాలు కన్పిస్తున్నాయి. కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఈ వ్యాధి ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మళ్లీ పెరుగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్న చిన్నారుల్లో ఈ జ్వర లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు వైరల్‌ లక్షణాలుగా భావించినా చికిత్స తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే...ఆసుపత్రిలో చేరేవరకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు. స్కార్లెట్‌ జ్వరమనేది స్ట్రెప్టోకోకల్‌ ఫారింగైటిస్‌ బ్యాక్టీరియా కారణంగా సోకుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ద్వారా పక్కనున్న పిల్లలకు అంటుకుంటుంది. ఈ తుంపర్లు పడిన చోట చేతులు పెట్టి వాటిని గొంతు, ముక్కు వద్ద తాకించినా ఇతరులకు సోకుతుంది. ఇప్పటికే నగరంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఈ స్కార్లెట్‌ జ్వరంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు సూచిస్తూ వాట్సాప్‌  సమాచారం పంపాయి. లక్షణాలు కన్పిస్తే...వెంటనే చికిత్స అందించాలని...వ్యాధి తగ్గే వరకు పిల్లలను పాఠశాలలకు పంపొద్దని అందులో సూచించాయి.

ఇవీ లక్షణాలు...

  • 102 డిగ్రీలతో కూడిన జ్వరం
  • ఆకస్మాత్తుగా గొంతు నొప్పి
  • తలనొప్పి, వికారం, వాంతులు
  • కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు
  • నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారుతుంది
  • గొంతు, నాలుకపై తెల్లని పూత
  • ట్రాన్సిల్స్‌ ఎరుపు రంగులో పెద్దవిగా కన్పిస్తాయి.

నిర్లక్ష్యం చేయొద్దు... వెంటనే చికిత్స అవసరం

- డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ శ్రీధర్‌, చిన్నపిల్లల అత్యవసర చికిత్స విభాగాధిపతి, అపోలో

తొలుత జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ప్రారంభమవుతాయి. మామూలేనని నిర్లక్ష్యం చేస్తే కొందరిలో న్యూమోనియా, రుమాటిక్‌ ఫీవర్‌, తీవ్రమైన కీళ్ల నొప్పులు, గుండె సమస్యకు దారి తీస్తుంది. ఈ సీజన్‌లో 5-15 ఏళ్ల వయస్సు పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కన్పిస్తే...ముందే వైద్యులను సంప్రదించాలి. వెంటనే యాంటిబయోటిక్స్‌ మందులు ఇవ్వడంతో పూర్తిగా తగ్గిపోతుంది. జ్వర లక్షణాలు ఉంటే...పిల్లలను పాఠశాలలకు పంపకూడదు. చేతుల శుభ్రత పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని