logo

Hyderabad: డ్రగ్స్‌ కేసు నిందితుడు విదేశాలకు పరార్‌

హైదరాబాద్‌లోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహణ కేసులో మరో ట్విస్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్‌ విదేశాలకు పరారయ్యాడు. ఏ9గా ఉన్న నీల్‌ గత నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కడం లేదు.

Updated : 01 Mar 2024 09:33 IST

మూడ్రోజులుగా లిషిత కనిపించడం లేదన్న ఆమె సోదరి
రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో వరుస ట్విస్టులు
తాజాగా డ్రగ్స్‌ సరఫరాదారు మీర్జా వహీద్‌ అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌, మాదాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహణ కేసులో మరో ట్విస్టు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నీల్‌ విదేశాలకు పరారయ్యాడు. ఏ9గా ఉన్న నీల్‌ గత నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కడం లేదు. అతడి ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేర్వేరు మార్గాల్లో ఆరా తీయగా విదేశాలకు పారిపోయినట్లు వెల్లడైంది. ఈ కేసులో మరో నిందితురాలు యూట్యూబర్‌ లిషి కనిపించడం లేదని ఆమె సోదరి యూట్యూబర్‌ కుషిత గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇవ్వడం ఇంకో ట్విస్టు. మరో ఇద్దరు నిందితులు సందీప్‌, శ్వేత తదితరులు ఇంకా పరారీలో ఉన్నారు. నీల్‌ విదేశాలకు పరారైన నేపథ్యంలో ఈ ముగ్గురి (లిషి, సందీప్‌, శ్వేత) ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహించిన కేసులో మంజీరా గ్రూపు సంస్థల డైరెక్టర్‌ గజ్జల వివేకానంద్‌, నిర్భయ్‌ సింధి (26), సలగంశెట్టి కేదార్‌నాథ్‌ (36) తొలి రోజు పోలీసులకు చిక్కారు. అప్పటి నుంచి సందీప్‌, శ్వేత, లిషి, నీల్‌ పరారీలోనే ఉన్నారు. ఈ కేసులో ఏ10గా ఉన్న సినీ దర్శకుడు క్రిష్‌ (జాగర్లమూడి రాధాకృష్ణ) సోమవారం విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. క్రిష్‌ను శుక్రవారం విచారణకు హాజరవ్వాలని పోలీసులు సూచించగా.. సోమవారం వస్తానని చెప్పినట్లు తెలిసింది.

పెరుగుతున్న నిందితుల జాబితా

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ నిర్వహణ కేసులో నిందితుల జాబితా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం పోలీసుల సోదాల తర్వాత ప్రధాన నిందితుడు వివేకానంద్‌, అతడికి డ్రగ్స్‌ సరఫరా చేసిన అబ్బాస్‌ అలీ జాఫ్రీతో పాటు మరో తొమ్మిదిమంది మీద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తు క్రమంలో వివేకానంద్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. తాజాగా డ్రగ్స్‌ సరఫరాదారు మీర్జా వహీద్‌ బేగ్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని ఈ కేసులో ఏ12గా చేర్చారు. నగరానికి చెందిన మీర్జా వహీద్‌ బేగ్‌ వేర్వేరు మార్గాల్లో డ్రగ్స్‌ తీసుకొచ్చి.. సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జాఫ్రీకి విక్రయిస్తాడు. అబ్బాస్‌ ఈ డ్రగ్స్‌ను వివేకానంద్‌ డ్రైవర్‌ గద్దల ప్రవీణ్‌కు ఇస్తాడు. ప్రవీణ్‌ ద్వారా వివేకానంద్‌కు డ్రగ్స్‌ చేరేవని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మీర్జా వహీద్‌ అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని అన్ని కోణాల్లో విచారిస్తున్న క్రమంలో ఇద్దరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరు డ్రగ్స్‌ పెడ్లర్లను, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్‌ను వహీద్‌కు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో ఆదివారం 10 మంది నిందితులు ఉండగా.. బుధవారం నాటికి ఈ సంఖ్య 12కు చేరింది. గురువారం 14కు పెరిగింది.


మా అక్క కనిపించడం లేదంటూ..

మరో నిందితురాలు యూట్యూబర్‌ లిషి మూడు రోజులుగా కనిపించడం లేదంటూ ఆమె సోదరి నటి కుషిత గచ్చిబౌలి పోలీసులకు చెప్పడం మరో ట్విస్టు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లిషి విచారణకు హాజరవ్వాలని సోమవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. లిషి సోదరి కుషిత న్యాయవాదితో కలిసి బుధవారం రాత్రి ఠాణాకు వచ్చారు. డ్రగ్స్‌ కేసు నమోదైన నాటి నుంచి తన సోదరి కనిపించడం లేదని చెప్పింది.


విచారణకు రఘుచరణ్‌: కేసులో ఏ4గా ఉన్న రఘుచరణ్‌ గురువారం గచ్చిబౌలి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. కేసు నమోదు అనంతరం ఇతడు పరారయ్యాడు. తర్వాత పోలీసులు సంప్రదించగా బెంగళూరులో ఉన్నానన్నాడు. గురువారం విచారణతోపాటు అతడి మూత్ర నమూనాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని