logo

మిషన్‌ భగీరథ పనులంటూ.. రూ.1.3 కోట్లకు కుచ్చుటోపీ

మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఖమ్మం మున్సిపాలిటీలో పైపులైను పనులు చేసినట్లు నకిలీ పత్రాలు సమర్పించి కెనరా బ్యాంకుకు రూ.1.3 కోట్లు టోకరా వేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులకు చిక్కాడు.

Published : 03 Mar 2024 01:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఖమ్మం మున్సిపాలిటీలో పైపులైను పనులు చేసినట్లు నకిలీ పత్రాలు సమర్పించి కెనరా బ్యాంకుకు రూ.1.3 కోట్లు టోకరా వేసిన కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులకు చిక్కాడు. సహకరించిన బ్యాంకు మేనేజర్‌ను రెండు వారాల క్రితం అరెస్టు చేసిన పోలీసులు.. ఇప్పుడు మరొకర్ని రిమాండుకు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నాడు. సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ డీసీపీ కె.ప్రసాద్‌, ఏసీపీ హుస్సేన్‌ నాయుడు శనివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.

మేనేజర్‌తో కలిసి మోసం.. రామంతాపూర్‌కు చెందిన మహ్మద్‌ ఫయాజ్‌, మహ్మద్‌ చాంద్‌ పాషా ఇద్దరూ కలిసి ఏఎఫ్‌ఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ఏర్పాటు చేశారు. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం తీసుకోవాలనుకున్నారు. మిషన్‌ భగీరథ కాంట్రాక్టు తీసుకున్నట్లు.. మొత్తం పని పూర్తిచేసినట్లు బాలానగర్‌లోని కెనరా బ్యాంకులో 2018-2021లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, ప్రాజెక్టు వివరాలు సమర్పించారు. అప్పటి మేనేజర్‌ శ్రీనివాసబాబు.. నకిలీవని తెలిసినా రూ.1.3 కోట్ల రుణం మంజూరు చేశారు. బ్యాంకు అధికారుల తనిఖీల్లో ఇది బయటపడింది. రామంతాపూర్‌ ప్రగతినగర్‌లోని చిరునామాకు వెళ్లగా అక్కడ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ కార్యాలయం లేదు. ఈ వ్యవహారంపై బాలానగర్‌ ఠాణాలో కేసు నమోదైంది. నిందితులతో చేతులు కలిపిన శ్రీనివాసబాబును ఫిబ్రవరి 20న, మహ్మద్‌ ఫయాజ్‌ను శనివారం అరెస్టు చేసి.. రిమాండుకు తరలించారు. మహ్మద్‌ చాంద్‌ పాషా పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని