logo

వేలిముద్రలు నకిలీ.. అవినీతి మకిలి

పారిశుద్ధ్య కార్మికుల పేరుతో జీహెచ్‌ఎంసీలోని పలువురు సహాయ వైద్యాధికారులు(ఏఎంఓహెచ్‌) ప్రతినెలా రూ.లక్షలు దోచేస్తున్నారు.

Published : 03 Mar 2024 02:00 IST

గైర్హాజరైన కార్మికుల పేరుతో రూ.కోట్లు కాజేసిన అధికారులు
జాబితాలోని 11 బోగస్‌ పేర్లు తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: పారిశుద్ధ్య కార్మికుల పేరుతో జీహెచ్‌ఎంసీలోని పలువురు సహాయ వైద్యాధికారులు(ఏఎంఓహెచ్‌) ప్రతినెలా రూ.లక్షలు దోచేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌), ఎస్‌ఎస్‌ (శానిటరీ సూపర్‌వైజర్లు)ల సాయంతో ప్రజాధనాన్ని ఊడ్చేస్తున్నారు.  తాజాగా అంబర్‌పేట సర్కిల్‌కు చెందిన ఇద్దరు ఎస్‌ఎఫ్‌ఏలు సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు నకిలీ వేలిముద్రలతో అడ్డంగా దొరకడం గమనార్హం. ఈ విషయాన్ని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తీవ్రంగా పరిగణించారు. ఆయన ఆదేశాలతో అంబర్‌పేట సర్కిల్‌కు చెందిన 11 మందిని ఉద్యోగం నుంచి తొలగించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబర్‌పేట సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ జ్యోతిబాయిని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ తీవ్రంగా మందలించారు. ఆమెపై వేటు పడే అవకాశముందని కేంద్ర కార్యాలయం తెలిపింది.

ప్రక్షాళనకు చర్యలు: నగరంలోని 30 సర్కిళ్లలో 18వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజూ 10 నుంచి 20శాతం మంది గైర్హాజరవుతుంటారు. వారిలో సెలవు తీసుకున్న కార్మికులెందరు, చాలా కాలంగా విధులకు రాని వారెందరో లెక్క తేల్చాలని కమిషనర్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. సింథటిక్‌ వేలి ముద్రలతో బినామీ కార్మికులను కలిగిన ఎస్‌ఎఫ్‌ఏలను ఉపేక్షించొద్దని, అవకతవకలకు పాల్పడుతోన్న సహాయ వైద్యాధికారుల వివరాలివ్వాలని కమిషనర్‌ జోనల్‌, సర్కిళ్ల కమిషనర్లకు స్పష్టం చేశారు.

బయోమెట్రిక్‌ యంత్రాలపై సింథటిక్‌ వేలిముద్రలను ఉంచి నకిలీ హాజరుతో రూ.లక్షలు కొల్లగొడుతోన్న అక్రమార్కులను అడ్డుకునేందుకు కమిషనర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బయోమెట్రిక్‌ యంత్రాల స్థానంలో ముఖాన్ని స్కానింగ్‌ చేసే మొబైల్‌ యాప్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. టెండరు ప్రక్రియ పురోగతిలో ఉందని కేంద్ర కార్యాలయం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని