logo

బాల్యం.. ఇటుక బట్టీలో దైన్యం

జిల్లాలోని పల్లెల్లో ఇటుక బట్టీల వ్యాపారం జోరందుకుంటోంది.

Published : 03 Mar 2024 02:03 IST

న్యూస్‌టుడే, పెద్దేముల్‌: జిల్లాలోని పల్లెల్లో ఇటుక బట్టీల వ్యాపారం జోరందుకుంటోంది. వలస కూలీలు వారి పిల్లలతో సహా వచ్చి వీటిలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం    జిల్లాలో బట్టీలు పెరుగుతున్నాయి.  బాల కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సంబంధిత బట్టీల       యజమానులు వీటిని ఏర్పాటుచేయడంతోపాటు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా అధికారులు స్పందించడం లేదని  విమర్శలొసున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

వలస జీవులుగా వచ్చి..

జిల్లాలోని పెద్దేముల్‌ మండలం కందనెల్లి తండా, తాండూరు మండలం అంతారం తండా, కుల్కచర్ల, పరిగి, వికారాబాద్‌, ధారూర్‌ తదితర మండలాల్లో ఇటుకల బట్టీలు నిరంతరం కొనసాగుతున్నాయి. వేసవి వచ్చిదంటే పని ఎక్కువగా ఉంటుంది. ఇందుకోసం ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. డిసెంబరు నెలలో దళారులతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కూలీలు పిల్లలను సైతం వెంట తెస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ మొదటి వారం వరకు ఇటుక బట్టీలు ముమ్మరంగా కొనసాగుతాయి. ఈ సమయంలో కూలీలు గత్యంతరం లేక పిల్లలనుకూడా పనులకు పంపిస్తున్నారు.

అనారోగ్యం పాలవుతున్న చిన్నారులు

పిల్లలను పనిలో పెట్టడం వల్ల చదవుకోవాల్సిన వయసులో ఇటుక బట్టీల్లో చిన్నారుల బాల్యం మసకబారుతోంది. ఇటుకల తయారీ, మట్టి మోయడం వంటివి చిన్నారుల సామర్ధ్యానికి మించినా అలాగే  చేయిస్తున్నారు. దీంతో మానసికంగా, శరీరకంగా, సామాజికంగా నైతికంగా కుంగుబాటుకు గురవుతున్నారు.

బట్టీల్లో పని సమయంలో రేగే దుమ్ము, ధూళితో అవస్థలు పడుతున్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులతో సతమతం అవుతున్నా పట్టింపు లేకుండా పోతోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో వారికి ఏం జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు.  

అనుమతుల్లేకుండానే ఏర్పాటు

బాల కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఇటుక బట్టీల యజమానులు వ్యవహరిస్తున్నా కార్మిక శాఖ అధికారులు, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు బట్టీల వైపు దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి.

ఏటా చైల్డ్‌లైన్‌ అధికారులు, పోలీసులు స్వచ్ఛంద సంస్థలు డిసెంబరు, జనవరి నెలల్లో బడి బయట పిల్లల సర్వే చేపడుతున్నారు. అయితే వీరు పరిశ్రమలు, క్వారీలు, ఇళ్లు, కాలనీలు తదితరాలకే పరిమితం అవుతున్నారు. బట్టీలు ఎక్కడో దూరంగా ఉండటం, సమయానికి వీరు వెళ్లక పోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో బట్టీలో జరుగుతున్న బాలల చాకిరీ బయటకు వెల్లడి కావడంలేదని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టి బాలలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని