logo

చేవెళ్ల భాజపా అభ్యర్థి..‘కొండా’

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేస్తూ భాజపా తొలి జాబితా శనివారం ప్రకటించింది.

Published : 03 Mar 2024 02:04 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌, చేవెళ్ల: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అభ్యర్ధిగా ఖరారు చేస్తూ భాజపా తొలి జాబితా శనివారం ప్రకటించింది. టికెట్‌ తనకే దక్కుతుందన్న నమ్మకంతో ఆయన జిల్లాలోని తాండూర్‌, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో ఇటీవల పర్యటించారు.

ఇదీ రాజకీయ ప్రస్థానం

చేవెళ్ల పార్లమెంటు నుంచి 2014లో జరిగిన ఎన్నికల్లో భారాస తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డిపై 73 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. భారాస అధినేత కేసీఆర్‌తో పొసగక రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి, భారాస అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో 27 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో పరాజితులయ్యారు. అనంతర పరిణామాలతో భాజపాలో చేరారు. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి భాజపా అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. ఈ స్థానానికి పలువురు పోటీ పడ్డా అధిష్ఠానం విశ్వేశ్వర్‌రెడ్డి అభ్యర్ధిత్వానికే మొగ్గు చూపింది.

నిజాం కాలంలో తాత : కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి నిజాం మంత్రివర్గంలో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పేరు మీదే రంగారెడ్డి జిల్లా ఏర్పాటు కావడం గమనార్హం. కొండా వెంకట రంగారెడ్డి రాజకీయ వారసుడిగా విశ్వేశ్వర్‌రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తన తండ్రి పేరు మీద జేకేఎంఆర్‌ ఫౌండేషన్‌ స్థాపించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నేటికీ కొనసాగిస్తున్నారు.

కుటుంబ వివరాలు..

పేరు: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (64)
తల్లిదండ్రులు: జయలత, కొండా మాధవరెడ్డి (ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర హై కోర్ట్‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి)
భార్య: సంగీతారెడ్డి (అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)
పిల్లలు: ముగ్గురు కుమారులు (అనందిత్‌, విశ్వజిత్‌, విరాజ్‌)
స్వగ్రామం: పెద్ద మంగళారం, మొయినాబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా
విద్యాభ్యాసం: అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి, మెడికల్‌ ఇన్నోవేటర్‌గా ఎన్నో ఆవిష్కరణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని