logo

ఆటంకాలు తొలగేలా.. అర్జీలు పరిష్కారమయ్యేలా..

‘ధరణి’ చిక్కుముడుల వలలో చిక్కి విలవిలలాడిన దరఖాస్తు దారులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగే సమయం వచ్చేసింది.

Published : 03 Mar 2024 02:05 IST

ధరణి సమస్యల పరిశీలనకు ప్రత్యేక కార్యాచరణ

తాండూరు తహసీల్దారు కార్యాలయం

న్యూస్‌టుడే, తాండూరు: ‘ధరణి’ చిక్కుముడుల వలలో చిక్కి విలవిలలాడిన దరఖాస్తు దారులకు ఎట్టకేలకు ఉపశమనం కలిగే సమయం వచ్చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం లభించే దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లాలోని రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈనెల 9వరకు పెండింగ్‌ సమస్యల పరిష్కారం కొనసాగనుంది. ఆటంకాలు తొలగించి అర్జీలు పరిష్కారమయ్యే విధంగా చూడాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ఎన్నెన్నో సమస్యలు

జిల్లాలో 20 మండలాలు, 566 గ్రామ పంచాయతీలున్నాయి. ధరణిలో భూ సంబంధమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు, ఇతరులు చేసుకున్న ద]రఖాస్తులు 14,228 ఉన్నాయి. వీటిలో పట్టా పాస్‌బుక్‌లకు సంబంధించి 232 కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పాస్‌బుక్‌లో ఒక పేరుంటే ధరణి పోర్టల్‌లో ఇంకో పేరు ఉండడం, వివాదాస్పద భూమికి పాస్‌బుక్‌ జారీ చేయడం, వాణిజ్య, వ్యాపార, లేఔట్లకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించే భూములకు నాలా ధ్రువీకరణ లేకుండా పాస్‌ బుక్‌ల జారీ, వారసత్వ భూ మార్పిడి, తప్పొప్పుల సవరణ వంటి సమస్యలెన్నో ఉన్నాయి.  

నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా..

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహశీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలకు ద]రఖాస్తులు వచ్చాయి. సాంకేతిక కారణాలకు తోడు ఇతరత్రా కారణాల వల్ల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది.  దీంతో కొందరు రైతులు డబ్బు అవసరాల రీత్యా భూములను అమ్ముకోలేని పరిస్థితి నెల కొంది. నాలా ధ్రువీకరణ రాక  పోవడంతో పొలాలను ఇళ్ల స్థలాలుగా విక్రయించే పరిస్థితి లేకుండా పోయింది. మరి కొందరు వ్యవసాయ భూముల్లో నాలా లేకుండా గృహాలు నిర్మించుకునేందుకు బ్యాంకుల నుంచి రుణం పొందే పరిస్థితి లేకుండా పోయింది.

అత్యధిక ద]రఖాస్తులు వికారాబాద్‌లోనే..

ధరణిలో భూ సంబంధ సమస్యలను పరిష్కరించాలని జిల్లాలోని 20 మండలాల్లో చేసుకున్న ధరఖాస్తుల్లో అత్యధికంగా వికారాబాద్‌లోనే 1,724 ఉన్నాయి. అత్యల్పంగా చౌడాపూర్‌లో 186 పెండింగులో ఉన్నాయి. పూడూరు 1,345, మోమిన్‌పేట 1,303, నవాబుపేట 1,179, మర్పల్లి 1.147, దోమ 1,010, పరిగి 935, దౌల్తాబాద్‌ 721, ధారూర్‌ 645, పెద్దేముల్‌ 579, కొడంగల్‌ 519, తాండూరు 504 కుల్కచర్ల 498, యాలాల 483, కోట్‌పల్లి 394, బొంరాస్‌పేట 350, బంట్వారం 260, దుద్యాల 234, బషీరాబాద్‌ 212 చొప్పున ద]రఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి సిబ్బంది బృందాలుగా గ్రామాలకు వెళతారని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు