logo

ఈ లోకంలో కమ్మనైన మాట అమ్మ

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సతీమణి ఉష జన్మదిన వేడుకలు శనివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఘనంగా నిర్వహించారు.

Updated : 03 Mar 2024 06:03 IST

వెంకయ్యనాయుడు, ఉష దంపతులను ఆశీర్వదిస్తున్న వేదపండితులు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సతీమణి ఉష జన్మదిన వేడుకలు శనివారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఘనంగా నిర్వహించారు. వెంకయ్యనాయుడు, ఉష దంపతుల కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్‌, కుమార్తె దీపావెంకట్‌ ఆధ్వర్యంలో ‘మనసుల లోగిలి ఉషోదయ సప్తతి’ పేరుతో ‘మా అమ్మే మా కుటుంబ ఐశ్వర్యం’ అంటూ ఉష 70వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఉష దంపతుల మిత్రులైన 75 కుటుంబాలకు చెందిన వారు హాజరయ్యారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని సంతోషంగా గడిపారు. అమ్మ ప్రేమ మాధుర్యాన్ని వివరించేలా నిర్వహించిన సినీ గీతాల విభావరి అలరించింది. అనంతరం తెలుగింటి విందుభోజనంతో కార్యక్రమాన్ని ముగించారు. ‘ఈనాడు’ ఎండీ చెరుకూరి కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, డా. కేఐ వరప్రసాద్‌రెడ్డి దంపతులు, ఐపీఎస్‌ అధికారులు జేవీరాముడు, సీఆర్‌ నాయుడు దంపతులు, ఏఐజీ ఆసుపత్రి వైద్యుడు డా.నాగేశ్వరరెడ్డి, డా.బొల్లినేని భాస్కరరావు, బొల్లినేని కృష్ణయ్య, శీనయ్య దంపతులు పాల్గొన్నారు. విశాఖ, బెంగళూరు, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన వెంకయ్యనాయుడి చిరకాల మిత్రులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ‘అమ్మ కన్నా కమ్మనైన మాట మరొకటి ఉందా? అమ్మను మించిన ప్రేమ మరొకటి ఉందా? తన తనువు అంతర్భాగాలకు చైతన్యమిచ్చి తన శిశువులుగా లోకానికి పరిచయం చేసి, కంటిపాపలుగా చూసుకొనే అమ్మను ఎప్పటికీ మరిచిపోవద్దు’ అని సందేశమిచ్చారు.‘తమ కుమారుడు హర్షవర్ధన్‌, కోడలు రాధ, కుమార్తె దీప, అల్లుడు వెంకట్‌ కలిసి నా సతికి జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉంది’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని