logo

Hyderabad: ఊదేసి దొరికారో.. బాదేసి వదిలేస్తారు

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులు కేవలం చలానాలు, న్యాయస్థానం విధించే శిక్షలకే కాదు.. అనధికార జరిమానాలకు సిద్ధమవ్వాల్సిందే.

Updated : 03 Mar 2024 08:28 IST

ఈనాడు- హైదరాబాద్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులు కేవలం చలానాలు, న్యాయస్థానం విధించే శిక్షలకే కాదు.. అనధికార జరిమానాలకు సిద్ధమవ్వాల్సిందే. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని కొన్ని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది చేతివాటమే ఇందుకు కారణం. కొందరు స్వాధీనం చేసుకున్న వాహనం బూచీగా చూపించి అందినకాడికి వసూలు చేస్తున్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా మూడు కమిషనరేట్ల పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలకు ఎంతోకొంత అడ్డుకట్టపడుతోంది. నిబంధనల ప్రకారం డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఎవరైనా పట్టుబడినప్పుడు వారి వెంట మద్యం తాగని మరో డ్రైవరు ఉంటే వాహనం అతనికి ఇచ్చేస్తున్నారు. వాహనదారు ఒక్కరే ఉంటే మాత్రం వాహనం తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటారు. రక్తంలో మద్యం మోతాదును బట్టి వారిపై అధిక చలానాలు, న్యాయస్థానం జైలు శిక్ష/ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆదేశిస్తుంది. ఆ తర్వాత వాహనం అప్పగించేస్తున్నారు. జరిమానా చెల్లించి.. వాహనం తీసుకునే సమయంలోనే కొందరు కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు దిగుతున్నారు. వాహనాలు ఇవ్వకుండా వేధింపులకు దిగుతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, చాలామంది బేరమాడి ఆమ్యామ్యాలు సమర్పించుకుంటున్నారు.

ఇవీ ఉదాహరణలు

  • సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల చిన్న తరహా గూడ్సు వాహనంతో ఓ వ్యక్తి డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. పోలీసులు వాహనం స్వాధీనం చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి చలానా చెల్లించాడు. తన వాహనం అప్పగించాలని కోరగా అప్పుడే ఇవ్వబోమని ట్రాఫిక్‌ సిబ్బంది చెప్పారు. వాహనదారు బతిమిలాడగా.. రూ.5 వేలు డిమాండ్‌ చేయగా.. మరో మార్గం లేక అడిగినంత ఇవ్వాల్సి వచ్చింది.
  • ఇటీవల ఓ యువకుడు డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికాడు. పోలీసులు వాహనం అప్పగించినా అతని ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తే కోర్టుకు హాజరై చలానా విధించే వరకూ తమ దగ్గరే ఉంటుందని.. జరిమానా కట్టాక ఇస్తామని బదులిచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని