logo

అడిగినంత ఇస్తేనే మీసేవ

జనన, మరణ ధ్రువపత్రాలు కావాలంటే ఎవరైనా వెళ్లేది మీసేవా కేంద్రాలకే. అయితే ఈ కేంద్రాలు అక్రమార్జనకు అడ్డాగా మారుతున్నాయి.

Updated : 03 Mar 2024 06:02 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జనన, మరణ ధ్రువపత్రాలు కావాలంటే ఎవరైనా వెళ్లేది మీసేవా కేంద్రాలకే. అయితే ఈ కేంద్రాలు అక్రమార్జనకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన రుసుంకంటే అధికంగా వసూలు చేస్తున్నాయి. పౌర సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది.. మీసేవా కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజలు ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా 2018లో టీ-యాప్‌ ఫోలియోను అందుబాటులోకి తెచ్చినప్పటికీ దానిపై ప్రజలకు అవగాహన లేక మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. టీ-యాప్‌ ద్వారా వచ్చే దరఖాస్తుల పరిశీలనలో ఆయా శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

అధిక వసూళ్లు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో వెయ్యికిపైగా మీసేవా కేంద్రాలున్నాయి. సుమారు 30 ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 312 రకాల పౌరసేవలు ఇక్కడ దొరుకుతాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్తుంటారు. నిబంధనల ప్రకారం ఎ-కేటగిరి సేవలకు రూ.35, బి-కేటగిరి సేవలకు రూ.45 సర్వీసు ఛార్జీలను వసూలు చేయాలి. ప్రతి కేంద్రంలో సేవల వివరాలు, వాటికి చెల్లించాల్సిన రుసుం, పని పూర్తయ్యేందుకు పట్టే సమయం తదితర వివరాలతో పట్టిక ఉంటుంది. అయితే వాటి ప్రకారం ఫీజు తీసుకోరు. రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. రసీదు ఇవ్వరు. ఎవరైనా అడిగితే స్టేషనరీ, ఇతర ఖర్చులుంటాయని దబాయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేక నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఓ కేంద్రానికి ఓ వ్యక్తి జనన ధ్రువపత్రంలో మార్పులకు వెళ్తే దరఖాస్తుకు అవసరమైన పత్రాలు జతచేసి రూ.150 చెల్లించాలని నిర్వాహకుడు సూచించాడు. వాస్తవంగా చెల్లించాల్సిన దానికి ఈ మొత్తం దాదాపు రెట్టింపు.ః మరణ ధ్రువపత్రానికి దరఖాస్తు చేసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్తే అన్ని వివరాలు చూసిన నిర్వాహకుడు రూ.100 డిమాండ్‌ చేశారు. ఇది దాదాపు రెండింతలు అధికం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని