logo

సుందరీకరణతో మోసం.. చెరువుల ధ్వంసం

నగరంలో అత్యధిక చెరువులున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొన్నేళ్ల వ్యవధిలో చెరువులు, కుంటల విధ్వంసం జరిగింది.

Updated : 03 Mar 2024 05:57 IST

శాఖల మధ్య సమన్వయ లోపం

మసీద్‌బండ జంగం కుంటలో నింపిన బండరాళ్లు

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: నగరంలో అత్యధిక చెరువులున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొన్నేళ్ల వ్యవధిలో చెరువులు, కుంటల విధ్వంసం జరిగింది. అనేక కుంటల్ని ఆక్రమించేసి మాయం చేయగా.. మరికొన్ని చెరువుల్లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ ప్రాంతాలను మింగేసి యథేచ్ఛగా నిర్మాణాలు సాగించారు.  కొన్నేళ్ల క్రితం సుందరీకరణకు చర్యలు ఆరంభించారు. ఎక్కడ సక్రమంగా పూర్తి చేసిన దాఖలాల్లేవు. ప్రతి చోటా అక్రమాలే చోటుచేసుకున్నాయి. చెరువుల సుందరీకరణలో కట్ట ఏర్పాటు, వాకింగ్‌ ట్రాక్‌ అంటూ పనులు  మొదలుపెట్టి బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ జోన్‌ పరిధిలో ఉన్న స్థలాలు, భూములు ఉన్నవారికి వారికి అనుకూలంగా వ్యవహరించారు.

  • నల్లగండ్ల చెరువును వీలైనంత మేర ఆక్రమించడానికి అవకాశం కల్పించి.. మిగిలిన ప్రాంతంలో సుందరీకరణ అంటూ కట్ట వేస్తున్నారు.
  • గంగారం పెద్ద చెరువును సుందరీకరణ పేరుతో నీటిని మొత్తం తీసేశారు. కబ్జాదారులు నిర్మాణాలు చేసుకోవడానికి సహకరించారు.
  • పటేల్‌ చెరువుది ఇదే పరిస్థితి. కబ్జాదారులకు చెరువు భూమి వదిలేసి మిగతా దాంట్లో సుందరీకరణ పనులు చేపట్టారు.
  • గోపి చెరువుకు వరద నీరు చేరే పరివాహక ప్రాంతం మొత్తం కబ్జా అవుతున్నా చర్యలు లేవు. ఇలా గోపన్‌పల్లి, మాదాపూర్‌, ఖాజాగూడ, మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి ప్రాంతంలో పలు చెరువుల కబ్జాలు నిరంతర ప్రక్రియగా మారినా నీటి పారుదలశాఖ అధికారుల్లో చలనంలేదు. నల్లగండ్ల, మదీనాగూడ, మియాపూర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో అడ్డగోలు అక్రమాలు సాగాయి. మసీద్‌బండలోని జంగంకుంటలో కబ్జాదారులు బండ రాళ్లు నింపేశారు. మరో కుంట చుట్టూ ఓ నిర్మాణ సంస్థ రేకులతో చుట్టేసి మింగేస్తోంది.
  • మియాపూర్‌ రామసముద్రం కుంట ఆక్రమణలపై చర్యలు లేవు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని