logo

రంగారెడ్డి జిల్లాలో నిలిచిన సున్నా బిల్లులు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో సున్నా విద్యుత్తు బిల్లుల ప్రక్రియను మొదలు పెట్టలేదు.

Published : 03 Mar 2024 02:23 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో అడ్డంకి

ఆసిఫ్‌నగర్‌లో సున్నా విద్యుత్తు బిల్లు అందజేస్తున్న మెట్రోజోన్‌ సీజీఎం నర్సింహస్వామి, సెంట్రల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బ్రహ్మం తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, యాచారం: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో సున్నా విద్యుత్తు బిల్లుల ప్రక్రియను మొదలు పెట్టలేదు. ఎప్పటి మాదిరే సాధారణ బిల్లులే జారీ అయ్యాయి.  ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఆహారభద్రత కార్డు కలిగిన అర్హులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే గృహజ్యోతి పథకం సిటీలో శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.  సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌, సైబర్‌సిటీ విద్యుత్తు సర్కిళ్లలోని అత్యధిక సెక్షన్లు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గృహజ్యోతి మ్యాపింగ్‌ అయిన వినియోగదారులు 4 లక్షలపైన ఉన్నారు. కేపీహెచ్‌బీ, బాలాజీనగర్‌ ప్రాంతాలు సైబర్‌సిటీ సర్కిల్‌ పరిధిలోనివే అయినప్పటికీ జిల్లా మేడ్చల్‌ కావడంతో అక్కడ సున్నా బిల్లులు ఇస్తున్నట్లు విద్యుత్తు అధికారులు తెలిపారు.

తర్వాత ఇస్తారా?

ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతనే అంటే వచ్చే నెలలో సున్నా బిల్లులు వస్తాయి. అయితే అప్పటికీ లోక్‌సభ ఎన్నికల కోడ్‌  వచ్చే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్‌లోనూ సందేహామే. ఎన్నికల సంఘం అనుమతిస్తే మాత్రం  ఇబ్బందులు ఉండవని అధికారులు అంటున్నారు. మార్చి నెల బిల్లులు చెల్లించాలా? సర్కారే తర్వాత నెలలో సర్దుబాటు చేస్తుందా అనేది త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు.

రెండోరోజు జోరు..

మెట్రోజోన్‌ పరిధిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌, సౌత్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌ సర్కిళ్లలో రెండో రోజు సున్నా బిల్లులు జారీ చేశారు. సీజీఎం నర్సింహస్వామి, ఎస్‌ఈ బ్రహ్మం క్షేత్రస్థాయిలో జారీ ప్రక్రియను ఆసిఫ్‌నగర్‌ సెక్షన్‌ పరిధిలో పరిశీలించారు. వినియోగదారులకు స్వయంగా గృహజ్యోతి సున్నా బిల్లులు ఇచ్చారు. మేడ్చల్‌ పరిధిలో హబ్సిగూడ, మేడ్చల్‌ సర్కిళ్లలోనూ రెండోరోజు శనివారం సున్నా బిల్లుల జారీ ముమ్మరంగా సాగింది. పదో తేదీ వరకు బిల్లులు జారీ పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసినా వేర్వేరు కారణాలతో కొందరికి సున్నా బిల్లులు రాలేదు. వీరిని మళ్లీ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని