logo

మూడేళ్లుగా పనులు.. మునక తప్పదని దిగులు

వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) కింద చేపట్టిన నాలా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Published : 03 Mar 2024 02:24 IST

బాగ్‌లింగంపల్లి పద్మాకాలనీలో అసంపూర్తిగా నాలా నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) కింద చేపట్టిన నాలా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు మూడేళ్ల కిందట మొదలవగా.. ఇప్పటి వరకు 60 శాతమే పూర్తయ్యాయి. ఏడాది కాలంగా 10శాతమైనా పురోగతి లేదంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత వర్షాకాలంలో ముంపు సమస్యను ఎదుర్కొన్న కాలనీల్లోనూ పనులు పడకేశాయి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అక్కడ చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

తీవ్రంగా నష్టపోయిన పద్మాకాలనీ

ఏప్రిల్‌ 28, 2023న రాంనగర్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల వరదతో బాగ్‌లింగంపల్లి పక్కనున్న పద్మాకాలనీ ముంపునకు గురైంది. సుమారు వంద ఇళ్లు నీట మునిగాయి. 40 ద్విచక్ర వాహనాలు నాలాల్లోకి కొట్టుకుపోయాయి. ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టిన నాలా పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆ ప్రమాదం జరిగింది.  హుస్సేన్‌సాగర్‌ వరదనాలా రక్షణ గోడ పనులు నిలిచిపోవడంతో హిమాయత్‌నగర్‌లోని పలు వీధుల్లోకి వరద పోటెత్తుతోంది. సరూర్‌నగర్‌ చెరువు నుంచి మూసీ వరకు చేపట్టిన నాలా పనులు చైతన్యపురిలో నిలిచిపోయాయి. చార్మినార్‌ జోన్‌లో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలాయి. వాటన్నింటినీ రాబోయే వానా కాలానికి పూర్తి చేయాలని, లేదంటే ఎప్పటిలాగే ముంపు తప్పదని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.

రూ.985 కోట్లతో పనులు

జీహెచ్‌ఎంసీతోపాటు శివారు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో  రూ.985 కోట్లతో చేపట్టిన 57 పనులు.. మూడేళ్లయినా 60శాతమే పూర్తయ్యాయి. గడిచిన ఏడాదిలో పురోగతి 10 శాతానికన్నా తక్కువే. శివారులోని జల్‌పల్లి, పెద్దఅంబర్‌పేట, మీర్‌పేట, బండంగ్‌పేట, బోడుప్పల్‌, పీర్జాదిగూడ ప్రాంతాల్లో   చేపట్టిన పనులకు నిధుల సమస్య అడ్డంకిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని