logo

కమల దళం.. అనుభవమే బలం

రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను భాజపా ప్రకటించింది.

Updated : 03 Mar 2024 05:53 IST

నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన భాజపా

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని పరిధిలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీకి దిగే అభ్యర్థుల పేర్లను భాజపా ప్రకటించింది. మిగిలిన పార్టీలకంటే ముందు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల యుద్ధానికి భాజపా సిద్ధమైంది. మూడు స్థానాల్లో కీలక నేతలను బరిలో దింపిన పార్టీ.. హైదరాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా మహిళను పోటీకి నిలిపింది. సికింద్రాబాద్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ కిషన్‌రెడ్డిని, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్‌ను, చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని, హైదరాబాద్‌ నుంచి మాధవీలతను పోటీకి నిలుపుతున్నట్లు భాజపా అధిష్ఠానం ప్రకటించింది. 


ఫలించిన ఈటల ప్రయత్నాలు..

ఈసారి నాలుగు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీనియర్‌ నేతలను బరిలో దింపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి పోటీకి దిగిన సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి మల్కాజిగిరి స్థానంపై దృష్టిసారించి ప్రయత్నాలు చేశారు. కీలకమైన నేత కావడం.. రాజకీయాల్లో అనుభవం ఉండటంతో ఆయనకే టిక్కెట్‌ దక్కింది.


మరోసారి సికింద్రాబాద్‌ నుంచి..

మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కిషన్‌రెడ్డి గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి బరిలో నిలిచి గెలిచారు. అనంతర పరిణామాల్లో మంత్రివర్గంలో చోటుదక్కింది. శాసనసభ ఎన్నికలకు ముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరోసారి సికింద్రాబాద్‌ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.


సరికొత్త అస్త్రం..

ఎంఐఎంకు కంచుకోటలా మారిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి భాజపా ఈసారి సరికొత్త అస్త్రాన్ని వదిలింది. ఎంఐఎంకు గట్టిపోటీ ఇవ్వడానికి విరించి ఆసుపత్రి ఫౌండర్‌ ఛైర్మన్‌ విశ్వనాథ్‌ సతీమణి మాధవీలతను పోటీకి నిలిపారు. ఆమె కొన్నేళ్లుగా లతా ఫౌండేషన్‌ పేరుతో పాతబస్తీలో అనేక సేవాకార్యక్రమాలు చేపడుతూ అక్కడి ప్రజలకు దగ్గరయ్యారు. పేదలను ఆదుకోవడంలో మంచి పేరు సంపాదించారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బరిలో నిలపాలని తొలుత భావించారు. దీనికి ఆయన నిరాకరించారని సమాచారం.


మూడోసారి బరిలోకి..

చేవెళ్ల నుంచి పార్టీ సీనియర్‌ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మూడోసారి బరిలో దిగుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెరాస నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందిన కొంతకాలానికి ఆ పార్టీతో విబేధాలు ఏర్పడటంతో పార్టీకి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్‌లో చేరారు. 2019 లోస్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తరువాత భాజపాలో చేరారు. తాజాగా భాజపా అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నారు.


భువనగిరిలో..బూర

ఈనాడు, నల్గొండ: భువనగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థిగా మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ను ఆ పార్టీ ప్రకటించింది.  నియోజకవర్గంలో భారీగా ఉన్న బీసీ ఓట్ల నేపథ్యంలో పార్టీ  బూర నర్సయ్య వైపే మొగ్గు చూపింది. గతంలోనే  ఆయన భువనగిరి నుంచి పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి కాగా.. తొలిసారి భాజపా తరఫున బరిలో నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని