logo

మహానటి సావిత్రి.. నన్ను మంచి నటుడివి అవుతావన్నారు

Updated : 03 Apr 2024 05:24 IST

‘సావిత్రి క్లాసిక్స్‌’ ఆవిష్కరణలో చిరంజీవి

రాయదుర్గం, న్యూస్‌టుడే: మహానటి సావిత్రితో తనకూ అనుబంధం ఉందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. తన తొలి సినిమా ‘పునాది రాళ్లు’లో ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చిందన్నారు. 1978 ఫిబ్రవరిలో రాజమండ్రిలో షూటింగ్‌ మధ్యలో వర్షం రావడంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లామన్నారు. తోటి నటుల కోరిక మేరకు నృత్యం చేస్తూ కింద పడినా కొనసాగించడంతో తనను సావిత్రి దగ్గరికి తీసుకుని నా ఆసక్తి, అంకితభావం చూసి గొప్ప నటుడవుతావని ప్రశంసించారన్నారు. రచయిత సంజయ్‌ కిషోర్‌ రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి ఆవిష్కరించారు.

నటుడు, నిర్మాత మురళీమోహన్‌ మాట్లాడుతూ.. 8 సినిమాల్లో ఆమె తన తల్లిగా నటించినట్లు చెప్పారు. బ్రహ్మానందం ప్రసంగిస్తూ.. సావిత్రి నట శిఖరమని కొనియాడారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఆమె నవరసావిత్రి అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. 15 ఏటనే సినిమాల్లోకి వచ్చి ఆత్మవిశ్వాసంతో మహానటిగా ఎదిగారని చెప్పారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. తన తల్లి జీవిత కథకు సంబంధించి అనేక పుస్తకాలు వచ్చాయని, ఆమె నటించిన గొప్ప సినిమాల విశేషాలతో పుస్తకాన్ని రాయాలని కిషోర్‌ను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, వ్యాపారవేత్త బొల్లినేని కృష్ణయ్య, జయసుధ, సావిత్రి అల్లుడు గోవిందరావు, సంజయ్‌ కిషోర్‌ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని