logo

లబ్ధిదారుల వద్దకే ఈ-పోస్‌ యంత్రాలు

చౌకధరల దుకాణాలు మూసివేసిన తర్వాత కొన్నిచోట్ల ఈ-పోస్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. లబ్ధిదారులను వెతుక్కుంటూ వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నాయి.

Published : 03 Apr 2024 02:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: చౌకధరల దుకాణాలు మూసివేసిన తర్వాత కొన్నిచోట్ల ఈ-పోస్‌ యంత్రాలు పనిచేస్తున్నాయి. లబ్ధిదారులను వెతుక్కుంటూ వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నాయి. అవును ఇది నిజమే.. పేదల బియ్యం పక్కదారి పట్టించడంలో సిద్ధహస్తులుగా మారిన కొందరి రేషన్‌డీలర్ల నిర్వాకం ఇది. నిబంధనలకు విరుద్ధంగా సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం మాడ్గుల చౌకదుకాణం డీలర్‌ ఇ-పోస్‌ యంత్రాన్ని వనస్థలిపురం తీసుకెళ్లి లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుంటుండగా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని కేజీ చొప్పున డబ్బులు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం ఏప్రిల్‌కు సంబంధించిన రేషన్‌ పంపిణీ ప్రారంభం కాగా రాత్రివేళలో యంత్రం ద్వారా లావాదేవీలు అవుతుండటం అధికారులు గుర్తించి జీపీఎస్‌ సాయంతో ఆ ప్రదేశానికి వెళ్లి డీలరు నిర్వాకాన్ని బట్టబయలు చేశారు. అతనిపై క్రిమినల్‌ కేసు నమోదుచేసినట్టు తెలిపారు. రాజధాని పరిధి మూడు జిల్లాల్లో ఏటా 700కిపైగా 6ఏ కేసులు, 300 క్రిమినల్‌ కేసులు నమోదవుతున్నాయి.

అనేక చోట్ల ఇదే పరిస్థితి.. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు డీలర్లు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. రేషన్‌కార్డులుండి రేషన్‌ తీసుకోకుండా నగరంలో వలసఉన్నవారిని గుర్తించి వారివద్దకే ఇ-పోస్‌ యంత్రాలను తీసుకొచ్చి వేలిముద్రలు వేయిస్తూ వారి కోటా బియ్యాన్ని స్వాహా చేస్తున్నారు. రాజధాని పరిధిలో 17లక్షల రేషన్‌ కార్డులు ఉండగా అందులో లక్ష కార్డుదారులకు సంబంధించిన పంపిణీ లావాదేవీలు రాత్రివేళలో జరుగుతున్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల్లో తనిఖీలుచేసి కోటాలో వ్యత్యాసాలుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని