logo

మంజీరా.. లీకేజీలు పట్టించుకోరా?

మహానగర నీటి సరఫరాలో కీలకమైన మంజీరా పైపులైన్లకు లీకేజీల బెడద తీవ్రమవుతోంది. చాలా ప్రాంతాల్లో లీకేజీలు పెద్దగా మారి తరచూ ఎక్కడో ఒక చోట పైపులు పగిలిపోతున్నాయి.

Published : 03 Apr 2024 02:21 IST

మోకీల వద్ద మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: మహానగర నీటి సరఫరాలో కీలకమైన మంజీరా పైపులైన్లకు లీకేజీల బెడద తీవ్రమవుతోంది. చాలా ప్రాంతాల్లో లీకేజీలు పెద్దగా మారి తరచూ ఎక్కడో ఒక చోట పైపులు పగిలిపోతున్నాయి. గతంలో భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌ కింద భారీ పైపులైన్‌ పగిలిపోవడంతో తాగునీరు రోడ్లను ముంచెత్తింది. తాజాగా సింగూరు ఫేజ్‌కు సంబంధించి సింగాపూర్‌ నుంచి ఖానాపూర్‌ వరకు ఉన్న 1,200 ఎంఎం డయా గ్రావిటీ మెయిన్‌ లైన్‌కు మోకిల వద్ద భారీ లీకేజీ ఏర్పడి లక్షల కొద్దీ గ్యాలన్ల తాగునీరు వృథాగా పోయింది. దీనిని అరికట్టడానికి 24 గంటల సమయం పట్టింది. పాత వ్యవస్థ కావడంతో అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫేజ్‌-1లో పైపుల మరమ్మతుల కోసం గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా ముందుకు కదలలేదు. మంజీరా ఫేజ్‌-1ను 1965లో ఫేజ్‌-2ను 1981లో అందుబాటులోకి తెచ్చారు. రోజు 45 మిలియన్‌ గ్యాలన్లు సేకరించేవారు. నగరం విస్తరించడం...జనాభా, నీటి అవసరాలు పెరగడంతో అప్పటి ప్రభుత్వం మంజీరా ప్రాజెక్టు ఎగువున ఉండే సింగూరు నుంచి రెండు ఫేజ్‌ల్లో మరో 75 ఎంజీడీలు సేకరిస్తోంది. సింగూరు నుంచి 1991లో ఫేజ్‌-3, 1994లో ఫేజ్‌-4ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోజూ 120 ఎంజీడీలు నగరానికి తరలిస్తున్నారు. కృష్ణా నీళ్లు వచ్చేవరకు జంట జలాశయాలతోపాటు సింగూరు, మంజీరా ప్రాజెక్టులే నగరానికి పెద్ద దిక్కు. అనంతరం కృష్ణా మూడు దశలు, గోదావరి నుంచి కూడా నీటిని తరలిస్తున్నారు. కృష్ణా, గోదావరి జలాల తరలింపుతో పోల్చుకుంటే సింగూరు, మంజీరా నిర్వహణ ఖర్చు స్వల్పమే. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ పైపుల మరమ్మతులకు గతంలో జలమండలి ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. అడుగు ముందుకు పడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని