logo

ఒక్కటీ లక్ష్యం చేరకపాయె!

జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలైంది. ప్రభుత్వం రాయితీ కల్పించినా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పుర సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేపట్టినా శతశాతం కాదుకదా, కనీసం ఆశించిన విధంగా కూడా వసూలు కాలేదు.

Published : 03 Apr 2024 02:28 IST

ఆస్తి పన్ను వసూలులో నాలుగు పురపాలికలూ వెనుకంజ

పరిగిలో పన్ను సేకరణలో పుర సిబ్బంది (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: జిల్లాలోని నాలుగు పురపాలికల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలైంది. ప్రభుత్వం రాయితీ కల్పించినా, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పుర సిబ్బంది ఇంటింటికి తిరిగి పన్ను వసూలు చేపట్టినా శతశాతం కాదుకదా, కనీసం ఆశించిన విధంగా కూడా వసూలు కాలేదు. దీనికిగల కారణాలు, భవిష్య కార్యాచరణ తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

రెండు పాతవి..రెండు కొత్తవి 

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ పురపాలిక సంఘాలున్నాయి. వీటిలో తాండూరు, వికారాబాద్‌ పాతవి. 2018లో పరిగి, కొడంగల్‌ కొత్తగా ఏర్పడ్డాయి. పాత వాటిలో సిబ్బంది తగినంతగా ఉండగా కొత్త వాటిలో మాత్రం సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రెవెన్యూ విభాగం పర్యవేక్షణ లేకపోవడంతో వసూళ్లు మందగించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శతశాతం ఎక్కడా లేదు: ఒక్క పురపాలికలో కూడా వంద శాతం ఆస్తి పన్ను వసూలు కాలేదు. అన్ని విభాగాల అధికారులు సిబ్బందితో పన్ను వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఉదయం 7 నుంచి ఇంటింటికీ వెళ్లాయి. ఇంతచేసినా ఫలితం రాలేదు. గత డిసెంబర్‌లో శాసన సభా ఎన్నికలు జరిగాయి. దీంతో సిబ్బంది తిరగడానికి వీలుకాకుండా పోయింది. ఈ ప్రభావం కూడా ఒక కారణంగా నిలిచింది. 

వెసులుబాటు వినియోగం తక్కువే : పన్ను బకాయిల వసూలుకు వడ్డీపై 90 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. వడ్డీ మాఫీ కోసం వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం వరకున్న బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేశారు. ఇంత జరిగినా , ప్రచార లోపంతో సద్వినియోగం చేసుకున్న వారు అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం.  


వికారాబాద్‌ పురపాలిక పర్లేదు

- జాకీర్‌ అహ్మద్‌, పుర కమిషనర్‌, వికారాబాద్‌

వికారాబాద్‌ పురపాలికలో 91 శాతం ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో 14వ స్థానంలో ఉన్నాం. ఇందుకోసం సిబ్బంది బాగా శ్రమించారు. వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేశాం. బకాయ పన్నులు కూడా వసూలు చేయడానికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని