logo

తవ్వడంలో ఉత్సాహం.. తారు వేయడంలో తాత్సారం

రెండుమూడు కిలోమీటర్లు తవ్వకాలు చేపట్టి వెంటనే కంకర, తారు పనులు పూర్తి చేస్తే సౌకర్యంగా ఉంటుంది, అలా కాకుండా జాతీయ రహదారుల విభాగం అధికారులు ఒకేసారి 40 కిలోమీటర్లు తవ్వేయించి తారు పనులు ‘నత్తనడకన నయం’ అన్నట్లుగా చేయిస్తున్నారు.

Published : 03 Apr 2024 02:33 IST

నత్తనడకన రూ.682 కోట్ల జాతీయ రహదారి పనులు
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

ప్రమాదకరంగా..

రెండుమూడు కిలోమీటర్లు తవ్వకాలు చేపట్టి వెంటనే కంకర, తారు పనులు పూర్తి చేస్తే సౌకర్యంగా ఉంటుంది, అలా కాకుండా జాతీయ రహదారుల విభాగం అధికారులు ఒకేసారి 40 కిలోమీటర్లు తవ్వేయించి తారు పనులు ‘నత్తనడకన నయం’ అన్నట్లుగా చేయిస్తున్నారు. దీంతో నెలల తరబడి అవస్థలకు గురిచేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తారు పనులు చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.

సక్రమంగా సాగని జాతీయ రహదారి పనులతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. రెండేళ్లుగా గుంతలు పడి దెబ్బతిన్న రహదారికి ఇరువైపులా తవ్వకాలు చేపట్టారు. 40 కి.మీ.వరకు దారిపొడవునా నాలుగు అడుగుల లోతున తవ్వేశారు. కంకర, తారు పనులు చేపడితే రాకపోకలకు సౌకర్యంగా మారుతుంది. కానీ అధికారుల అలసత్వం, గుత్తేదారు నిర్లక్ష్యంతో తారు పనులు నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. వెరసి నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే 6వేలకుపైగా వాహనదారులు లక్ష మందికిపైగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

ఏడాదిన్నర క్రితం నాలుగు వరుసలకు శ్రీకారం: ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం తాండూరు మండలం మీదుగా కర్ణాటక రాష్ట్రం మన్నెకెల్లి నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌వరకు జాతీయ రహదారిగా ప్రకటించింది. నాలుగు వరసల రహదారి నిర్మించేందుకు రూ.682కోట్లు మంజూరు చేసింది. వాటితో పనులు చేపట్టిన గుత్తేదారు కొడంగల్‌ నుంచి తాండూరు మండలం కొత్లాపూర్‌ వరకు 40 కిలోమీటర్లు రహదారికి ఇరువైపులా తవ్వేశారు. రాత్రివేళ గుంతలోకి వాహనాలు దూసుకెళ్లి ప్రమాదాలు జరగకుండా వాహనదారుల్ని అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డులు అమర్చలేదు. సిమెంటు బస్తాల్లో కర్రలు పాతి సన్నని దారం కట్టి చేతులు దులిపేసుకున్నారు.

రోడ్డుపై లేస్తున్న దుమ్ము

పెద్ద ఎత్తున దుమ్ములేస్తోంది

రహదారి మార్గంలో గుంతల్లో ఎర్రమట్టి, రహదారి వారగా నాపరాయి వ్యర్థాలు, సుద్ద  కుమ్మరించడంతో వాహనాల రాకపోకల సమయంలో పెద్దఎత్తున దుమ్ము లేస్తోంది. వాహనాలు కన్పించనంతగా వెలువడుతున్న దుమ్ముతో వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు జంకుతున్నారు. దుమ్ము లేవకుండా ట్యాంకర్ల ద్వారా నీరు పోయాల్సి ఉన్నప్పటికీ గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దుమ్ము కారణంగా శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడే ప్రమాదముందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని