logo

ఇంట్లో ఉన్నా.. వడదెబ్బ ముప్పు!

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 8 నుంచి భానుడు ఠారెత్తిస్తున్నాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 వరకు వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు.

Updated : 03 Apr 2024 08:05 IST

రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత
ఉస్మానియా, గాంధీలో చికిత్సలకు ప్రత్యేక చర్యలు

డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్‌, గాంధీ ఆసుపత్రి

ఈనాడు, హైదరాబాద్‌: రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీలు దాటుతోంది. ఉదయం 8 నుంచి భానుడు ఠారెత్తిస్తున్నాడు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 వరకు వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఉన్నా కొన్నిసార్లు వడదెబ్బ ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి కారణంగా అనారోగ్యంతో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు ఉండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. రోగుల కోసం గాంధీ, ఉస్మానియాలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఆర్‌ఎస్‌, ఫ్లూయిడ్స్‌ ఇతర ఔషధాలను అందుబాటులో ఉంచినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ఇంట్లో ఉన్నా సరే.. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన సూచనలిలా..

  • ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్లు, కూలర్ల కింద ఉండాలి. ఇంట్లోకి వేడి గాలులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వడగాల్పులు ఇంట్లోకి చేరకుండా కర్టెన్లు వాడాలి.
  • ఇంట్లో ఉన్నా.. తరచూ నీరు తాగాలి. ఉప్పు కలిపిన నిమ్మరసం లేదా మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్‌ పుష్కలంగా లభించి వడదెబ్బ బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిఒక్కరూ కనీసం 4 లీటర్లు నీరు తాగాలి. ఎండలో పని చేసేవారు మరో లీటరు అదనంగా తీసుకోవాలి.
  • వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను పీల్చి శరీరం చల్లబడేటట్లు చేస్తాయి. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3లోపు ఎండలో తిరగొద్దు. ఒకవేళ అత్యవసర పనిపై బయటకు వెళ్తే.. గొడుగు తప్పనిసరి.
  • వేసవిలో కలుషిత నీళ్లు ముప్పు అధికం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం సరికాదు. బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లడం ఉత్తమం. తాజాగా వండిన ఆహారం తీసుకోవడంతో పాటు బయట తినడం మానుకోవాలి.
  • వేసవిలో మద్యం శరీరానికి మరింత మప్పు చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉంటే మేలు. వేడి చేసి చల్లార్చిన నీటిలో ఓఆర్‌ఎస్‌ కలుపుకొని తాగడం వల్ల డీహైడ్రేషన్‌ బారినపడకుండా చూసుకోవచ్చు.
  • మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే డీహైడ్రేషన్‌ వల్ల బీపీ తగ్గి ఉంటుంది. ఈ సమయంలో బీపీ మందులు వేసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. బీపీ రోగులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఈ కాలంలో వాంతులు, విరేచనాలు కావడంతో పాటు అపస్మారక స్థితిలో ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని