logo

వారు కట్టేస్తున్నారు.. వీరు కళ్లు మూసుకున్నారు

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే సమీపంలో అసైన్డ్‌ భూములపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఈ భూముల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేయకపోవడంతో.. వాటిని సొంతం చేసుకుని పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు.

Updated : 03 Apr 2024 05:56 IST

ఎయిర్‌పోర్టుకు సమీపంలోని అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు
కబ్జాదారుల వివరాలు తెలిసినా పట్టించుకోని అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌

అసైన్డ్‌ భూముల్లో నిర్మిస్తున్న ఇళ్లు

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే సమీపంలో అసైన్డ్‌ భూములపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఈ భూముల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేయకపోవడంతో.. వాటిని సొంతం చేసుకుని పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇళ్ల నిర్మాణాలకు అధికారిక అనుమతులున్నట్లు లే-అవుట్ల తరహాలో వీటిని కడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రారంభమైన రెండు, మూడు రోజుల నుంచి జోరుగా నిర్మాణాలు సాగుతున్నా అధికారులు మిన్నకుండిపోయారు. శంషాబాద్‌-కోళ్లపడకల్‌ -తుక్కుగూడ ప్రధాన రహదారికి కిలోమీటర్‌ దూరంలోని అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలు కొనసాగుతున్నా రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు.

నోటరీ ధైర్యంతో విక్రయాలు...

అసైన్డ్‌ భూముల్లో ఇళ్లు నిర్మిస్తున్న కబ్జాదారులు వాటిని విక్రయించేందుకు జీవో నంబర్‌ 111ను తెలివిగా వాడుకుంటున్నారు. జీవో పరిధిలో భూములకు రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అవకాశాలు లేవని, నోటరీ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయిస్తామని చెబుతున్నారు. విమానాశ్రయం రన్‌వేకు దగ్గరగా ఉండడంతో  సంపన్నులు ఈ  ఇళ్లను కొనేందుకు ముందుకు వస్తున్నారు. సుమారు యాభైమంది సంపన్నులు ఒక్కొక్కరూ రెండు, మూడు ఇళ్ల చొప్పున కొనుగోలు చేశారు. మరింత మంది ముందుకు వస్తుండడంతో కబ్జాదారులు అసైన్డ్‌ భూములను ఆక్రమించుకుంటూ ముందుకెళ్తున్నారు. అక్కడ రైతులుంటే భూములు అమ్మాలంటూ వారిపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో కొని.. ఇళ్లు నిర్మించి రూ.కోట్లల్లో విక్రయిస్తున్నారు. 

చుట్టూ పచ్చదనం.. ఫామ్‌హౌస్‌లు.. రిసార్ట్‌లు.. 

శంషాబాద్‌, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ, గొల్లపల్లి, బహదూర్‌గూడ, తుక్కుగూడ ప్రాంతాల్లో చుట్టూ పచ్చదనం ఉండడంతో సంపన్నులు అక్కడ ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. ఒకటి, రెండేళ్ల నుంచి రిసార్ట్‌లు వెలుస్తున్నాయి. ఇక్కడే ప్రభుత్వ, అసైన్డ్‌ భూములుండడంతో కొందరు ప్రజాప్రతినిధులు, అక్రమార్కులతో కలిసి వాటిని సొంతం చేసుకోవాలని చూసున్నారు. ఇందులో భాగంగా సయ్యద్‌గూడలోని 200 ఎకరాల అసైన్డ్‌ భూములను ఎంచుకున్నారు. పంటలు పండని ప్రాంతాల్లో సరిహద్దు రాళ్లు పాతి కంచెలు వేసి.. ఇళ్లు నిర్మిస్తున్నారు. గతేడాది   రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమార్కులు కొద్దిరోజులు నిర్మాణాలను నిలిపేశారు. గత నెల ప్రారంభం నుంచి మళ్లీ ఇళ్లు కడుతున్నారు. ఈసారి అక్రమార్కులపై అధికారులు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని