logo

గతంలో రాత్రి.. ఇప్పుడేమో పగలే

వేసవి ఉష్ణోగ్రతల దెబ్బకు కరెంట్‌ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. విద్యుత్తు  వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్‌ 1న 81.78 మిలియన్‌ యూనిట్లతో జీహెచ్‌ఎంసీలో సరికొత్త రికార్డు నమోదైంది.

Updated : 03 Apr 2024 06:04 IST

కరెంట్‌ వినియోగంలో అనూహ్య మార్పులు
ఏప్రిల్‌ 1న 81.89 మిలియన్‌ యూనిట్ల వాడకం
ఈనాడు, హైదరాబాద్‌

వేసవి ఉష్ణోగ్రతల దెబ్బకు కరెంట్‌ మీటర్లు గిరగిరా తిరుగుతున్నాయి. విద్యుత్తు  వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్‌ 1న 81.78 మిలియన్‌ యూనిట్లతో జీహెచ్‌ఎంసీలో సరికొత్త రికార్డు నమోదైంది. మూడు రోజుల కిందట మార్చి 29న నమోదైన 81.39 మిలియన్‌ యూనిట్ల రికార్డు సోమవారం బద్దలైంది. డిమాండ్‌లోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి భిన్నమైన పోకడ కన్పిస్తోంది. క్రితం ఏడాది రాత్రి పూట గరిష్ఠ డిమాండ్‌ రికార్డైతే, ఈసారి పగటి పూటనే నమోదవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సోమవారం సాయంత్రం 4.03 గంటల ప్రాంతంలో 3832 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. గతేడాది మే 19న ఉన్న 3,756 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించింది. రాబోయే రోజుల్లో నాలుగు వేల మెగావాట్లను దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

900 మెగావాట్ల దాకా..

గతేడాది ఏప్రిల్‌ 1న 2,934 గరిష్ఠ డిమాండ్‌ అర్ధరాత్రి 1.40 గంటలకు నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఏకంగా 3,832 మెగావాట్లు సాయంత్రం 4.03 గంటలకు రికార్డైంది.

  • ఇటీవలి గరిష్ఠ డిమాండ్‌ను పరిశీలిస్తే.. మార్చి 28 సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గరిష్ఠ డిమాండ్‌ 3,677 మెగావాట్లు నమోదైంది. ఏడాది కిందట 3,215 మెగావాట్లు సాయంత్రం 7.16 గంటలకు నమోదైంది.
  • మార్చి 29 సాయంత్రం 7.11 గంటలకు 3742 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదు కాగా, గతేడాది 3,142 మెగావాట్లు సాయంత్రం 7.17 గంటలకు నమోదైంది.
  • మార్చి 30న 3,685 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ సాయంత్రం 4.02 గంటలకు రికార్డు కాగా, గతేడాది 3,101 మెగావాట్లు సాయంత్రం 7.17 గంటలకు నమోదైంది.

పగలూ.. ఏసీలు

పగటి పూట అధిక ఎండలతో ఏసీల వినియోగం పెరగడంతో గరిష్ఠ డిమాండ్‌ వేళలు మారినట్లుగా ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. గతంలో పగటి పూట సాధారణ డిమాండ్‌ ఉండి.. సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు లైటింగ్‌ లోడ్‌ పెరిగి గరిష్ఠ డిమాండ్‌ చేరుకునేది. కొన్నేళ్లుగా చూస్తే.. ఎక్కువ మంది రాత్రి 9 గంటల తర్వాతే ఏసీలను ఉపయోగించేవారని.. అలా అర్ధరాత్రి వరకు గరిష్ఠ డిమాండ్‌ కొనసాగేదని చెబుతున్నారు. ప్రస్తుతం అధిక ఎండల కారణంగా ఏసీల వాడకం పగటి పూట సైతం పెరగడంతో గరిష్ఠ డిమాండ్‌ సైతం పగటి పూటే రికార్డు అవుతుందని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని