logo

మూసీ ఒడ్డున నిర్మాణాలొద్దు.. నదికి ఇరువైపులా ఆంక్షలు

మూసీనది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులను నిలిపేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులనూ అనుమతించవద్దని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated : 03 Apr 2024 08:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: మూసీనది నుంచి 50 మీటర్ల పరిధిలో నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులను నిలిపేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులనూ అనుమతించవద్దని కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. ఆదేశాలను వెంటనే, నదికి ఇరువైపులా అమలుచేయాలని జోనల్‌ కమిషనర్లు, ఉప కమిషనర్లు, ప్రణాళికాధికారులు, సహాయ ప్రణాళికాధికారులను ఆదేశించారు. ఎంఆర్‌డీసీఎల్‌(మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)  అభ్యర్థన మేరకు బల్దియా ఈ నిర్ణయం తీసుకుంది.

సమగ్రాభివృద్ధి దిశగా..: మూసీని.. సంపదను సృష్టించే వనరుగా ఉపయోగించుకోవాలనేది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్ష. అందులో భాగంగా  నదిని సర్వే చేయాలని ఆదేశాలిచ్చారు.  ఆ మేరకు  సర్వేయర్ల ఆధ్వర్యంలో ఇటీవలి వరకు సర్వే జరిగింది. బఫర్‌ జోన్‌లో నిర్మాణ పనులను అధికారులు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయి పరిశీలనతో..‘ఈనాడు’ సైతం ఇటీవల కథనాన్ని ప్రచురించింది. వాటన్నింటినీ ఎంఆర్‌డీసీఎల్‌  పరిగణలోకి తీసుకొని. నది పొడవునా ఎలాంటి కట్టడాలను అనుమతించవద్దని సంబంధిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ప్రంచాయతీలు, జీహెచ్‌ఎంసీకి లేఖ రాయగా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తాజా ఉత్తర్వును జారీ చేశారు.  మూసీ నదిలో ఇప్పటికే 10వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు. బఫర్‌ జోన్‌పై అయోమయం ఉండేది. దాంతో.. కొందరు అధికారులు బఫర్‌ జోన్‌లోనూ అనుమతులు ఇచ్చేవారు.  ఈ నేపథ్యంలోనే.. రెవెన్యూ హద్దును ప్రామాణికంగా చేసుకుని 50 మీటర్ల బఫర్‌లో అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని