logo

జలఘంటిక.. మేల్కోవాలిక

రాజధానిలో భూగర్భ జలాలు ఆవిరవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా.. గతంతో పోలిస్తే తాగునీటి సరఫరా సమయం, నీటి ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంపులోని నీరు సగం రోజుకే తరిగిపోతున్నాయి.

Updated : 03 Apr 2024 08:27 IST

రోజు రోజుకు తీవ్రమవుతున్న నీటి కష్టాలు
ప్రభుత్వ కార్యాలయాలు, గృహ సముదాయాల్లో పొదుపు మంత్రం
ఈనాడు, హైదరాబాద్‌

రాజధానిలో భూగర్భ జలాలు ఆవిరవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా.. గతంతో పోలిస్తే తాగునీటి సరఫరా సమయం, నీటి ఒత్తిడి చాలా వరకు తగ్గింది. సంపులోని నీరు సగం రోజుకే తరిగిపోతున్నాయి. దాంతో.. వేలాది మంది రోజూ ట్యాంకర్ల కోసం జలమండలిని సంప్రదిస్తున్నారు. పలు ప్రభుత్వ ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లలోనూ నీటి ఎద్దడి కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు నీటి ట్యాంకర్ల సాయంతో అవసరాలను తీర్చుకుంటున్నారు. అదే సమయంలో.. కొన్ని కాలనీ సంఘాలు పొదుపు మంత్రం పఠిస్తున్నాయి. ఎండలు పెరుగుతుండటంతో సమస్య తీవ్రమవుతుందని, జలమండలి నీటి సరఫరాను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ.. భూగర్భ జలాలు అడుగంటడంతో సమస్య తలెత్తిందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

టీ కప్పులు కడిగేందుకూ.. కటకట

మాసబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఓ ప్రభుత్వ భవన సముదాయంలో రోజు విడిచి రోజు నీటి సమస్య ఎదురవుతోంది. దాంతో.. టీ కప్పులను శుభ్రం చేసేందుకు కూడా నీరు ఉండట్లేదని సిబ్బంది వాపోతున్నారు. ఇదేంటని ఆరాతీస్తే.. జలమండలి ద్వారా వచ్చే నీరు త్వరగా అయిపోతోందని, బోరుబావి ఎండిపోవడం వల్ల ట్యాంకర్లను తెప్పించుకుంటున్నామని, ఆ నీరు కూడా సరిపోవట్లేదని అధికారులు తెలిపారు.


మార్చిలో ఏకంగా 1.69 లక్షల ట్రిప్పులు

మణికొండలోని ఫిల్లింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఎండీ సుదర్శన్‌రెడ్డి

గ్రేటర్‌ వ్యాప్తంగా నీటి ట్యాంకర్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో నీటి సరఫరా కోసం జలమండలి ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. దీంతో ఒకేసారి ట్యాంకర్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఏడాది ఒక్క మార్చి నెలలోనే 1.68 లక్షల ట్రిప్పులను జలమండలి సరఫరా చేసింది. గతేడాది మార్చి నెలతో పోల్చితే 56 వేల ట్రిప్పులు అదనంగా అందించారు. వానలు లేకపోతే మే నెలలో మరింత డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా 660 ఎంజీడీల వరకు నీటి డిమాండ్‌ ఉండగా.. జలమండలి 560 ఎంజీడీల వరకు సరఫరా చేస్తోంది. డిమాండ్‌కు సరఫరాకు మధ్య దాదాపు 100 ఎంజీడీలు తేడా ఉంది. రోజూ జలమండలికి ట్యాంకర్ల కోసం 4900 వరకు ఫోన్లు వస్తుండగా..  6584 ట్రిప్పులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిత్యం 7 వేల ట్రిప్పులు పెండింగ్‌లో ఉంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ట్యాంకర్‌ బుక్‌ చేసిన 2-3 రోజులకు కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 24 గంటలపాటు సరఫరా చేయాలని జలమండలి ఇప్పటికే నిర్ణయించింది. 

కేంద్రాల తనిఖీ..

ఫిల్లింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి మంగళవారం కొన్ని కేంద్రాలను తనిఖీ చేశారు.  మణికొండ, నేతాజీపార్కు, షేక్‌పేట ఫిల్లింగ్‌ కేంద్రాలను తనిఖీలు చేసి అక్కడ లాగ్‌ బుక్‌లను పరిశీలించారు.  ప్రస్తుతం 75 ఫిల్లింగ్‌ కేంద్రాల్లో 121 పాయింట్ల ద్వారా ట్యాంకర్లు అందిస్తున్నామని, త్వరలో మరిన్ని ఫిల్లింగ్‌ కేంద్రాలను, ట్యాంకర్లను పెంచనున్నట్లు ఎండీ చెప్పారు.


‘అలేఖ్య’ ఆదర్శం..  ఈతకొలను మూసేద్దాం

ఎండాకాలం వచ్చిందంటే గేటెడ్‌ కమ్యూనిటీల్లోని ఈతకొలనుల్లో పిల్లలు, పెద్దలు జలకాలాడుతుంటారు.  చెప్పాలంటే ఈతకొలనులే గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రత్యేక ఆకర్షణ. నీటి ఎద్దడి కారణంగా ఈసారి స్వచ్ఛందంగానే పలుచోట్ల సొసైటీల్లోని ఈతకొలనులను మూసేస్తున్నారు. బెంగళూరులోని పరిస్థితి మన దగ్గర రాకూడదని ఎల్బీనగర్‌లోని అలేఖ్య టవర్స్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ ముందు జాగ్రత్తగా êఈసారి తమ కమ్యూనిటీలోని ఈత కొలనును తాత్కాలికంగా మూసేయాలని నిర్ణయించింది.  సిటీలో పెరుగుతున్న నీటి కొరతను గమనించి ఈ నిర్ణయం తీసుకుందని గృహ యాజమాని ఒకరు తెలిపారు. తమ కమ్యూనిటీలో నీటికొరత లేదని.. అయితే బయట చాలా ప్రాంతాల్లో తాగడానికి, వాడుకోవడానికి నీటికి ఇబ్బంది పడుతుంటే.. తాము జలకాలాటలు ఆడటం సరికాదని భావించి సొసైటీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని