logo

నెలాఖరున మెట్రో-2 డీపీఆర్‌.. క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేపట్టిన ఏజెన్సీలు

మెట్రోరైలు రెండోదశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) నెలాఖరుకు కొలిక్కి రానుంది.

Updated : 12 Apr 2024 07:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు రెండోదశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) నెలాఖరుకు కొలిక్కి రానుంది. క్షేత్రస్థాయిలో భూపరీక్షలు, ట్రాఫిక్‌, ఇతర సర్వేలన్నీ దాదాపు పూర్తికావొచ్చాయి. వీటన్నింటిని క్రోడీకరించి డీపీఆర్‌ రూపొందించే పనిలో ఏజెన్సీలున్నాయి. ప్రాథమిక నివేదిక అందగానే మెట్రోరైలు ఇంజినీర్లు, అధికారులు పరిశీలించి.. ప్రభుత్వంతో చర్చించి అవసరమైన మార్పులు, చేర్పుల అనంతరం తుది నివేదిక సిద్ధం చేయనున్నారు. మెట్రోరైలును రెండోదశలో 70 కి.మీ. మేర విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, చంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 29 కి.మీ., మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్‌, నూతన హైకోర్టు వరకు 4 కి.మీ., రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడ కూడలి, విప్రో సర్కిల్‌, అమెరికన్‌ కాన్సులేట్‌ 8 కి.మీ., మియాపూర్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌, పటాన్‌చెరు వరకు 14 కి.మీ., ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ 8 కి.మీ, నాగోల్‌ నుంచి ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట వరకు 7 కి.మీ. మార్గాలను సర్కారు ప్రతిపాదించింది. ఇందులో నాగోల్‌-ఫలక్‌నుమా 5.5 కి.మీ. డీపీఆర్‌ ఇదివరకే ఉంది. ఈ మార్గంలో పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. మిగిలిన మార్గాలకు úడీపీఆర్‌ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరు మార్గాల డీపీఆర్‌ బాధ్యతలను రెండు కన్సల్టెన్సీలకు హెచ్‌ఎంఆర్‌ అప్పగించింది. 2 నెలులుగా వీరు క్షేత్రస్తాయిలో సర్వేలు చేపట్టారు. విశ్లేషించి క్రోడీకరించడమే మిగిలిందని మెట్రోరైలు అధికారి ఒకరు అన్నారు. ఈ నెలాఖరుకు ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుందని చెప్పారు.

పూర్తి నివేదిక వచ్చాకే స్పష్టత..

70 కి.మీ. మార్గంలో కచ్చితంగా స్టేషన్‌ వచ్చే ప్రాంతం, ఎన్నిస్టేషన్లు రాబోతున్నాయనేది పూర్తి నివేదికతోనే స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. నిర్మాణ వ్యయం కూడా అప్పుడే తెలుస్తుందంటున్నారు.

సవాళ్లున్నాయ్‌..

  • నాగోల్‌ నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే మార్గంలో సాగర్‌ రింగ్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్లను దాటడం మెట్రోకి సవాల్‌. ఆస్తుల సేకరణ చేయాల్సి వస్తుంది. ః ఈ మార్గంలో మైలార్‌దేవ్‌పల్లి నుంచి విమానాశ్రయం వెనక గోడ వరకు విశాలమైన సెంట్రల్‌ మీడియన్‌లో పెద్దఎత్తున వృక్షాలు ఉన్నాయి. అవి వందల సంఖ్యలోనే ఉన్నాయి. పనులు చేపడితే వీటిని తొలగించాల్సి వస్తుంది.
  • మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు మార్గంలో డబుల్‌డెక్‌ స్తంభాలు.. ప్లైఓవర్‌, మెట్రో కోసం అనుకున్నప్పటికీ.. ఆలస్యం కారణంగా జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే రహదారి విస్తరణ, ఫ్లైఓవర్లను చేపట్టింది. దీంతో ఇక్కడ డబుల్‌ డెక్‌ కాకుండా సాధారణ మెట్రోకే డీపీఆర్‌లో ప్రాధాన్యం ఇచ్చారు.
  • ఎల్బీనగర్‌ - హయత్‌నగర్‌ మార్గంలో డబుల్‌ డెక్‌ వేయాలనే సూచనలు వచ్చాయి. సమన్వయ లోపం, డిజైన్లు సిద్ధంగా లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ ఎప్పటిమాదిరే ఫ్లైఓవర్లకు ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇక్కడ సైతం డీపీఆర్‌లో మెట్రోరైలు మార్గానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని