logo

దేశంలో 70 లక్షల మంది పార్కిన్సన్స్‌ బాధితులు

దేశంలో సుమారు 70 లక్షల మంది పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనల్లో తేలిందని  కిమ్స్‌ సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు అన్నారు.

Published : 12 Apr 2024 02:59 IST

అవగాహన కార్యక్రమంలో వైద్యులు

రెజిమెంటల్‌బజార్‌: దేశంలో సుమారు 70 లక్షల మంది పార్కిన్సన్స్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు తాజా పరిశోధనల్లో తేలిందని  కిమ్స్‌ సీఎండీ డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు అన్నారు. అంతర్జాతీయ పార్కిన్సన్స్‌డే సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌ కిమ్స్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యూరాలజిస్ట్‌ సీతాజయలక్ష్మి, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ మానస్‌ పాణిగ్రాహి, పార్కిన్సన్స్‌ స్పెషలిస్ట్‌ డా.జయశ్రీ, డాక్టర్‌ మోహన్‌దాస్‌, డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యూరో సమస్యలతో వైకల్యానికి, మరణాలకు కారణమవుతున్న వాటిలో పార్కిన్సన్స్‌ ఒకటని, 40 ఏళ్లు దాటిన లక్షమందిలో 94మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. డాక్టర్‌ జయశ్రీ మాట్లాడుతూ.. చేతులు అదే పనిగా వణికిపోతూ ఉండటం, మాట సరిగా రాకపోవడం, అడుగులు పడటం కష్టమవుతుండటం వ్యాధి లక్షణం అన్నారు. వందల ఏళ్ల క్రితం ఆయుర్వేదంలో దీన్ని కంపవాతం అని పిలిచేవారన్నారు. కంపం అంటే వణుకు, వాతం అంటే కండరాల సమస్య అని, అప్పట్లో దీనికి వెల్వెట్‌ బీన్‌ మొక్కతో చికిత్స చేసేవారని, ఆ మొక్క నుంచే లెవోడోపా అనే మందును అభివృద్ధి చేశారన్నారు. మహిళల కంటే పురుషులకే వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువన్నారు. డాక్టర్‌ మానస్‌ మాట్లాడుతూ.. డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ శస్త్రచికిత్స ప్రాచుర్యం పొందిందని, రోగి పరిస్థితిని, వయసును బట్టి దీన్ని నిర్ణయిస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని