logo

పాఠశాల విద్యార్థులకు విదేశీయాత్రలు

నగరంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు చాలావరకు వచ్చాయి. కొన్ని విదేశాల్లో పేరున్న విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పని చేస్తున్నాయి.

Published : 12 Apr 2024 03:00 IST

నగరం నుంచి పెరుగుతున్న విదేశీ ప్రయాణాలు

ఈనాడు - హైదరాబాద్‌: నగరంలో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు చాలావరకు వచ్చాయి. కొన్ని విదేశాల్లో పేరున్న విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పని చేస్తున్నాయి. అకడమిక్‌, క్రీడలు ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. వారికి నేరుగా అంతర్జాతీయ యాత్రలు నిర్వహిస్తూ అక్కడి వేడుకలు, కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. ఇవి విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి అనుభవాలను ఆకలింపు చేసుకునేలా చేసి వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని విద్యాలయాల బోధనా సిబ్బంది చెబుతున్నారు.

4వతరగతి నుంచే యాత్రలు

చిన్నప్పటి నుంచే పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకునేలా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. క్లిష్ట సమయంలో ఎలా వ్యవహరించాలో పిల్లలు తెలుసుకునేందుకు ఇలాంటి యాత్రలు ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే తల్లిదండ్రులు రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నప్పటికీ ఒక్కో యాత్రకు రూ.2లక్షల నుంచి రూ.4 లక్షలు అవుతున్నా వెనుకాడటంలేదు. ఎక్కువగా సింగపూర్‌, ఫ్రాన్స్‌, కెనడా, జపాన్‌ వంటి సురక్షితమైన దేశాలకు తీసుకెళ్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించేవారే విదేశాలకు పర్యటనలకు వెళ్లేవారు.. ప్రస్తుతం 4వ తరగతి నుంచే ఈ యాత్రలు చేస్తున్నారు. నగరంలోని అంతర్జాతీయ స్థాయి పాఠశాలలే కాదు పేరున్న విద్యాసంస్థలు ఈ యాత్రలు నిర్వహిస్తున్నాయి.

సురక్షితంగా వెళ్లి వస్తూ..

అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు, కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ ప్రకారం ఆయా పాఠశాలలు యాత్రలు నిర్వహిస్తున్నాయి. ప్రయాణ టిక్కెట్లు, వసతి, భోజన ఏర్పాట్లు, స్థానికంగా రవాణా సదుపాయాలను ముందుగానే బుక్‌ చేసుకుని విద్యార్థులను తీసుకెళ్తున్నట్టు ఔటర్‌రింగురోడ్డుకు చేరువలోని ఇంటర్నేషనల్‌ పాఠశాల ప్రిన్సిపల్‌ చెబుతున్నారు. అక్కడ ప్రాంతాలను పరిచయం చేయడంతో పాటు అక్కడి విద్యార్థులతో నేరుగా కల్పించి అన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని 25 పాఠశాలల వరకూ ఇలాంటి యాత్రలు నిర్వహిస్తున్నాయని అంతర్జాతీయ పర్యాటక యాత్రలు నిర్వహిస్తున్న ఓ సంస్థ తెలిపింది. తమ ద్వారా ఏటా 500 మందికి పైగా విద్యార్థులు యాత్రలకు వెళ్తున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని