logo

ఇంట్లో చోరీ జరిగిందని యువతి కట్టుకథ.. బీరువాలోని సామగ్రి చిందరవందర చేసి..

ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన ఓ యువతి నగదు పోగొట్టుకొని దొంగతనం జరిగిందని ఓ కట్టుకథ అల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

Updated : 12 Apr 2024 08:04 IST

గదిలో చిందరవందరగా  పడేసిన సామగ్రి

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడిన ఓ యువతి నగదు పోగొట్టుకొని దొంగతనం జరిగిందని ఓ కట్టుకథ అల్లి పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..ఎర్రబోడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ యువతి ఆన్‌లైన్‌ ఆటకు అలవాటు పడింది. అందులో కొంత జమచేస్తే ఎక్కువ మొత్తం వస్తాయని చెప్పడంతో ముందుగా రూ.200 పంపించగా..  రూ. 600 వచ్చాయి. దీంతో ఆమె వేలల్లో జమ చేయగా.. రూ.30 వేలు పోగొట్టుకుంది. ఇంట్లో ఉన్న కొద్దిబంగారం విక్రయించి మరో రూ.35 వేల వరకు పోగొట్టుకుంది. తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడింది.

అదే బస్తీలో ఇటీవల ఇద్దరు ముసుగు దొంగలు హల్‌చల్‌ చేయడంతో.. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ యువతి ఓ కట్టుకథను అల్లింది. గురువారం ఉదయం ఇంట్లో బీరువాలోని సామగ్రి చిందరవందర చేసింది. తాను బయటకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఇద్దరు ముసుగు దొంగలు ప్రవేశించారని అరిచి స్థానికులను పిలిచింది. స్థానికులు వచ్చాక దొంగలు పారిపోయినట్లు చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి వేగంగా స్పందించారు. యువతిని పూర్తి వివరాలు అడుగుతున్న క్రమంలో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించగా అదంతా కట్టుకథ అని తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని