logo

పట్టు నిలపాలని.. పాగా వేయాలని..

పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌, భారాస, భాజపాలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. 2008లో నూతనంగా ఏర్పడిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన భారాస మరో విజయంతో హ్యాట్రిక్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

Updated : 13 Apr 2024 05:13 IST

విజయమే లక్ష్యంగా పార్టీల వ్యూహరచన  

పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌, భారాస, భాజపాలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. 2008లో నూతనంగా ఏర్పడిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన భారాస మరో విజయంతో హ్యాట్రిక్‌ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్‌ రెండో గెలుపు నమోదు చేసి పట్టు సాధించాలని తహతహలాడుతోంది. ప్రధాని మోదీ చరిష్మాను నమ్ముకున్న భాజపా ప్రత్యేక వ్యూహంతో ఎన్నికల సమరంలో ముందుకెళ్తోంది.

న్యూస్‌టుడే, వికారాబాద్‌.

తొలి గెలుపు సాధనకు భాజపా కసరత్తు

తొలి విజయం కోసం కమలదళం కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడి భాజపాలో చేరి తమ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. తొలి విజయం కోసం శ్రమిస్తున్నారు.  

హ్యాట్రిక్‌ కోసం భారాస..

చేవెళ్లలో వరుసగా మూడో విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించాలని భారాస ప్రణాళికలు రచిస్తోంది. 2014లో భారాస అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, 2019లో గడ్డం రంజిత్‌రెడ్డిలు విజయం సాధించారు. శాసనసభ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సిట్టింగ్‌ ఎంపీ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తుండగా, తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించి భారాసలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో దించింది. గత శాసనసభ ఎన్నికల్లో భారాసకు ఏడు నియోజకవర్గాల్లో కలిపి కాంగ్రెస్‌ కంటే 65,600 ఓట్లు అధికంగా వచ్చాయి.ఈసారికూడా గెలుస్తామని ఆశిస్తున్నారు.

కార్యకర్తలను సమాయత్తం చేస్తూ..

భారాస నుంచి సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలువగా, భారాస కాసాని జ్ఞానేశ్వర్‌ను, భాజపా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలను తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఇంఛార్జిగా వేంనరేందర్‌రెడ్డి, భారాస ఇంఛార్జిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని నియమించగా, భాజపా ఇంకా నియమించలేదు. ప్రస్తుతం మూడు పార్టీలు నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నాయి.

రెండో గెలుపుపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి

చేవెళ్లలో రెండో విజయంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. 2009లో గెలిచిన ఆ పార్టీ 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రస్తుతం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ]్యం వహిస్తున్నారు. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో భారాస ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం, ఇతర పార్టీల నుంచి నాయకులు చేరడంతో కొంత బలం పుంజుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని