logo

‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో నకిలీ కరెన్సీ..

నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని శంషాబాద్‌ ఎస్వోటీ, మైలార్‌దేవుపల్లి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.6.62 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Updated : 13 Apr 2024 09:32 IST

ఇద్దరి అరెస్ట్‌.. రూ.6.62 లక్షల స్వాధీనం

 నకిలీ నోటుపై చిల్ట్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ముద్రణ

కాటేదాన్‌, న్యూస్‌టుడే: నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు యత్నించిన ఇద్దరిని శంషాబాద్‌ ఎస్వోటీ, మైలార్‌దేవుపల్లి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రూ.6.62 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ మధు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగరాజు స్టాక్‌బ్రోకరేజీ వ్యాపారం చేసి నష్టపోయాడు. నకిలీ కరెన్సీ చలామణితో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు రహస్యంగా నగదు పంపిణీ చేస్తుంటారని, ఇదే సరైన సమయమని తలచి తన ఆలోచన అమలు చేయాలనుకున్నాడు. మిత్రుడు అభినందన్‌తో కలిసి రెండునెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్‌ పవార్‌, సురేష్‌ పవార్‌లు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసిన నకిలీ కరెన్సీ వీడియో చూసి వారిని వీడియోకాల్‌తో సంప్రదించారు. రూ.వెయ్యికి రూ.ఐదు వేల చొప్పున నకిలీ నోట్లు లభిస్తాయని నిర్ధారించుకున్నారు. మహరాష్ట్రలోని చద్వేల్‌ పట్టణానికి వెళ్లి రూ.3.5 లక్షల అసలు నగదు అందించి రూ.17 లక్షల నకిలీ నోట్లు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో తమిళనాడు తిరువూరులో ఉండే రవి అనే వ్యాపారికి వాటిని అందించి వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా ఒప్పందం కుదరలేదు. గురువారం నగరం చేరుకుని సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో బసచేశారు. శుక్రవారం ఉదయం మల్కాజిగిరిలోని సాయిరామ్‌ థియేటర్‌ వద్ద ఓ బైక్‌ అద్దెకు తీసుకుని నకిలీనోట్లతో మైలార్‌దేవుపల్లి మెహఫిల్‌ హోటల్‌కు చేరుకుని సరఫరాకు యత్నించారు. విశ్వసనీయ సమాచారంతో అప్పటికే చేరుకున్న శంషాబాద్‌ ఎస్వోటీ పోలీసులు మైలార్‌దేవుపల్లి పోలీసుల సహకారంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లపై ఆర్బీఐ స్థానంలో చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అని ఉందని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని