logo

వేసవిలో చల్లదనం.. చుక్కల్లో వ్యయం

వేసవిలో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. కారణం.. ఏసీల వాడకం భారీగా పెరిగింది. ఇదివరకు ఇంటిలో ఒక ఏసీ వాడితే ఇప్పుడు 2, 3 వాడుతున్నారు.

Updated : 13 Apr 2024 07:10 IST

మార్చిలో భారీగా వినియోగ ఫలితం
నగరంలో నెల విద్యుత్తు బిల్లు రూ.190 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: వేసవిలో విద్యుత్తు వినియోగం పెరగడంతో రూ.వందల్లో రావాల్సిన బిల్లులు రూ.వేలల్లో వస్తున్నాయి. కారణం.. ఏసీల వాడకం భారీగా పెరిగింది. ఇదివరకు ఇంటిలో ఒక ఏసీ వాడితే ఇప్పుడు 2, 3 వాడుతున్నారు. ఆదాయాల వృద్ధితో జీవన ప్రమాణాలు పెరగడంతో ఆ మేరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం పెరిగింది. అదే స్థాయిలో కరెంట్‌ బిల్లులు వస్తున్నాయి. గ్రేటర్‌లో మూడు విద్యుత్తు జోన్లున్నాయి. ప్రధాన నగరం పరిధిలోకి మెట్రోజోన్‌ వస్తుంది. ఈ జోన్‌లో బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సౌత్‌, సికింద్రాబాద్‌ సర్కిళ్లున్నాయి. ఎల్‌టీకి సంబంధించి గృహ, వాణిజ్య కనెక్షన్లు కలిపి 21.60 లక్షలున్నాయి. మార్చిలో రూ.270 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఈ నెలలో చూస్తే ఏకంగా రూ.360 కోట్లకు పెరిగింది. ఏకంగా రూ.90 కోట్లు పెరిగింది. రంగారెడ్డి జోన్‌ పరిధిలో 4 సర్కిళ్లున్నాయి. ఇక్కడ బిల్లుల్లో పెరుగుదల రూ.70 కోట్లపైనే ఉంది. మేడ్చల్‌ జోన్‌లో 2 సర్కిళ్లున్నాయి. ఇక్కడ సైతం రూ.30 కోట్లపైనే పెరుగుదల నమోదైంది. మండే ఎండల వల్ల సిటీలో ఒక నెలలో అదనంగా రూ.190 కోట్ల వరకు వినియోగదారుల జేబుకు చిల్లుపడింది.

లోటు లేకుండా సరఫరా.. డిమాండ్‌ ఎంత పెరిగినా.. మార్చిలో కోతలు లేకుండా నిరంతర సరఫరాకు డిస్కం యత్నిస్తోంది. మార్చి 29న రికార్డు స్థాయిలో 81.39 మిలియన్‌ యూనిట్లు నమోదైతే మెట్రోజోన్‌, మేడ్చల్‌ జోన్‌లలో సున్నా బిల్లులు జారీ అయ్యాయి.

పొదుపు చర్యలతో.. అధికంగా బిల్లులు వస్తున్న గృహ వినియోగదారుల జీవనశైలిని గమనిస్తే వృథా కూడా ఎక్కువే ఉంటోందని ఎనర్జీ ఆడిట్‌ నిపుణులంటున్నారు.

  • అవసరం లేకపోయినా అన్ని గదుల్లో లైట్లు వెలుగుతుంటాయి. అవసరం లేని వాటిని ఆపేయాలి.
  • గదిలో ఎవరూ లేకపోయినా ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంటుంది. ఈ తరహా వృథా తగ్గించుకోవాలి. స్మార్ట్‌ స్విచ్‌ల ఏర్పాటుతో మొబైల్‌ నుంచే ఆపేయవచ్చు. సెన్సర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని