logo

రూపాయి నుంచి డాలర్‌ వయా క్రిప్టో కరెన్సీ

పెట్టుబడులకు అధిక లాభాలంటూ మోసగించి వందలాది మంది నుంచి కొట్టేసిన డబ్బును క్రిప్టోకరెన్సీలోకి ఆ తర్వాత అమెరికన్‌ డాలర్లుగా మారుస్తున్న హైటెక్‌ ముఠా సభ్యులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కేరళలో చిక్కారు.

Published : 14 Apr 2024 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడులకు అధిక లాభాలంటూ మోసగించి వందలాది మంది నుంచి కొట్టేసిన డబ్బును క్రిప్టోకరెన్సీలోకి ఆ తర్వాత అమెరికన్‌ డాలర్లుగా మారుస్తున్న హైటెక్‌ ముఠా సభ్యులు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు కేరళలో చిక్కారు. సూత్రధారులు దుబాయ్‌ కేంద్రంగా సైబర్‌ మోసాలు చేస్తుండగా.. నిందితులు తమ బ్యాంకు ఖాతాల్ని కమీషన్ల లెక్కన ఇస్తున్నారు. ఇప్పటివరకూ రూ.26 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి 5 ఫోన్లు, 15 చెక్‌బుక్కులు, 8 డెబిట్‌ కార్డులు, 2 రబ్బర్‌ స్టాంపుల్ని స్వాధీనం చేసుకున్నారు. సైబర్‌క్రైమ్‌ ఎస్సై ఉమ, ఇన్‌స్పెక్టర్‌ మట్టం రాజు, ఏసీపీ శివమారుతితో కలిసి డీసీపీ ధార కవిత శనివారం వివరాలు వెల్లడించారు.

కమీషన్‌ కోసం మోసాలు..

కేరళ కాసర్‌గోడ్‌కు చెందిన నౌషద్‌, అహ్మద్‌ కబీర్‌కు 2021లో ఇసాక్‌, తాహిర్‌ అలీ పరిచయమ్యారు. తాము సైబర్‌ నేరాల ద్వారా కొల్లగొట్టే డబ్బును జమ చేసేందుకు ఖాతాలిస్తే కమీషన్‌ ఇస్తామని ఇసాక్‌, తాహిర్‌ అలీ చెప్పగా అంగీకరించారు. నౌషద్‌, అహ్మద్‌ కబీర్‌ నకిలీ ధ్రువపత్రాలతో మొత్తం 18 బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించే పార్ట్‌టైమ్‌ జాబ్‌ ఉందని టెలిగ్రామ్‌, ఇతర సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ఇసాక్‌, తాహిర్‌ ప్రచారం చేస్తారు. అంతర్జాతీయ కంపెనీలకు లైకులు, రేటింగ్‌ ద్వారా కామెంట్లు ఇవ్వాలని.. బదులుగా తాము కమీషన్‌ ఇస్తామని నమ్మిస్తారు. టాస్కుల పేరుతో రేటింగులు ఇచ్చాక.. పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఆశ చూపి డబ్బు వసూలు చేసి పత్తా లేకుండా పోతారు. ఆ తర్వాత నగదును క్రిప్టో కరెన్సీలోకి మళ్లిస్తారు. నౌషద్‌ దుబాయ్‌ వెళ్లి క్రిప్టో కరెన్సీలో ఉన్న డబ్బును అమెరికన్‌ డాలర్లుగా మారుస్తారు.

ఎలా బయటపడిందంటే..?

గత జనవరిలో నగరానికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. తాత్కాలిక ఉద్యోగం ఉందని టెలిగ్రామ్‌ గ్రూపులో చేర్చి లింకు పంపించారు. బాధితుడు ఓ యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. కొన్ని కంపెనీలకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌, కామెంట్లు పెట్టాలని చెప్పి కొంత మొత్తం డబ్బును బాధితుడి బ్యాంకు ఖాతాకు పంపారు. ఆ తర్వాత నమ్మించి పెట్టుబడికి లాభాలు ఇస్తామని రూ.9.44 లక్షలు వసూలు చేశారు. బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నౌషద్‌, అహ్మద్‌ కబీర్‌ను అరెస్టు చేశారు. ఇసాక్‌, తాహిర్‌ అలీ పరారీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని