logo

ఇదేం దారుణం స్వామీ.. క్యాటరింగ్‌ ఏజెన్సీ నిర్వాహకుడి ఆగడాలివీ..

వేడుకలు, వివిధ కార్యక్రమాలకు క్యాటరింగ్‌ సిబ్బందిని సరఫరా చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో వేధింపులకు దిగుతున్న వ్యక్తిని నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 14 Apr 2024 11:09 IST

ఈనాడు- హైదరాబాద్‌: వేడుకలు, వివిధ కార్యక్రమాలకు క్యాటరింగ్‌ సిబ్బందిని సరఫరా చేసి అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో వేధింపులకు దిగుతున్న వ్యక్తిని నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ ధార కవిత శనివారం హైదరాబాద్‌లో కేసు వివరాలు వెల్లడించారు.

ఏపీలోని అనంతపురం పట్టణానికి చెందిన వున్నూరు స్వామి(34) యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. శుభకార్యాలు, వేడుకలకు క్యాటరింగ్‌ సిబ్బందిని పంపిస్తుంటాడు. ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి రిసెప్షన్‌కు క్యాటరింగ్‌ సిబ్బందిని పంపాలని కోరగా.. నిందితుడు స్వామి ఒక్కొక్కరికి రూ.550 చొప్పున రూ.7150 మాట్లాడి, తరువాత 15 వేలు డిమాండ్‌ చేశాడు.

నకిలీ ఖాతా.. అసభ్య పోస్టులు..

అడిగినంత డబ్బులు ఇవ్వడం లేదని బాధితుడితో పాటు పెళ్లి కొడుకు, ఆయన కుటుంబ సభ్యులకు కాల్‌ చేసి అసభ్యంగా దూషించాడు. బాధితుడి భార్య పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచి అసభ్య వ్యాఖ్యలతో ఆమె ఫొటోలు పోస్టు చేశాడు. ప్రజా మరుగుదొడ్లు, మెట్రో స్టేషన్ల దగ్గర ఫోన్‌ నంబర్లు రాశాడు. దీంతో విపరీతంగా కాల్స్‌ రావడంతో ఇబ్బందులు పడ్డారు. వేధింపులు భరించలేక కుటుంబం ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలనుకుని, చివరకు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటివరకూ 11 మందిని వేధించాడని తేలింది. నేరం చేసిన తర్వాత సిమ్‌కార్డులు మారుస్తాడు. ఇలా 30 నంబర్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని