logo

Hyderabad: తండ్రి చనిపోయిన ఐదో రోజే కొడుకు హత్య

కట్టుకున్న భర్త చనిపోయి ఐదు రోజులే అవుతోంది.. ఆయన   బాధ తీరనే లేదు.. ఈలోపే కొడుకు మద్యం మత్తులో సైకోగా మారాడు.. రాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ పరువు తీస్తున్నాడు.. చీరతో కాళ్లు, చేతులు కట్టేసినా ఆగడం లేదు.

Updated : 14 Apr 2024 09:18 IST

తల్లి, తమ్ముడే హంతకులు.. 

కోరె మురళి

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కట్టుకున్న భర్త చనిపోయి ఐదు రోజులే అవుతోంది.. ఆయన   బాధ తీరనే లేదు.. ఈలోపే కొడుకు మద్యం మత్తులో సైకోగా మారాడు.. రాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ వీధుల్లో తిరుగుతూ పరువు తీస్తున్నాడు.. చీరతో కాళ్లు, చేతులు కట్టేసినా ఆగడం లేదు. దీంతో ఆ తల్లి చిన్న కొడుకు సహకారంతో అదే చీర గొంతుకు బిగించడంతో పెద్దకొడుకు మృతి చెందిన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. రామంతాపూర్‌ కామాక్షిపురంలో ఉండే కోరె శోభకు కుమారులు మురళి అలియాస్‌ చింటు(23), మనోహర్‌(20) ఉన్నారు. మురళి డీజే ఆపరేటర్‌. చిన్న కొడుకు మనోహర్‌ డిగ్రీ చదువుతున్నాడు.  భర్త కుమార్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌తో  ఈనెల 8న మృతి చెందాడు. శుక్రవారం అస్థికలు లంగర్‌హౌస్‌లోని సంఘమెట్‌లో కలిపి వచ్చారు. అదే రాత్రి స్నేహితులతో కలిసి మురళి ఇంటిపైన మద్యం తాగాడు. మత్తులో అర్థరాత్రి వీధుల్లో తిరుగుతూ హంగామా చేశాడు. వచ్చిపోయే వాహనాలను అపాడు. ఓ వాహనదారుడి మీద పడి భుజం కొరికేందుకు యత్నించాడు. ఆ సమయంలో తల్లి అతడి స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎంతకూ వినకుండా అరుస్తుండటంతో  శోభ, తమ్ముడు మనోహర్‌ మురళిని చీరతో కాళ్లు, చేతులు కట్టేశారు. అయినప్పటికీ అరుస్తూనే ఉండటంతో అసహనంతో చీరను గొంతుకు గట్టిగా బిగించింది. దాంతో మురళి చనిపోయాడు. ఉదయం లేవడం లేదంటూ వీరిద్దరే అందరికీ చెప్పారు. మృతుడి పెద్దనాన్న కోరె శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

కుటుంబ పోషకుడు..:  తండ్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతుండటంతో మురళినే  డీజే ఆపరేటర్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.  కానీ మద్యం తాగిన సమయంలోనే  సైకోగా మారతాడు. గతంలోనూ బోనాల సమయంలో ఇదే తరహాలో వ్యవహరించాడు. అదే చివరికి ప్రాణాలను తీసేలా చేసింది.


మూడు రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురి దుర్మరణం


వీరయ్య

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో ఇద్దరు,. వనస్థలిపురంలో ఇద్దరు, పటాన్‌చెరులో ఒకరు విగతజీవులయ్యారు. 

నాగోలు: చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్తున్న మామా అల్లుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై దయాకర్‌రెడ్డి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బండ్లబాయి బజార్‌కు చెందిన సాడె వీరయ్య (78) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడు జగదీశ్‌తో కలిసి  గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కోసం శుక్రవారం హైదరాబాద్‌ వచ్చారు. హయత్‌నగర్‌లో ఉండే అల్లుడైన సుంకర మొగ్గయ్య (60) ఇంట్లో నిద్రించారు. శనివారం ఉదయం మొగ్గయ్యతో కలిసి వీరయ్య, జగదీశ్‌లు.. క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. సరూర్‌నగర్‌ స్టేడియం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఇసుక లారీని కారు ఢీకొట్టింది. ముందు సీట్లోని మొగ్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వీరయ్య  చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. జగదీశ్‌తో పాటు క్యాబ్‌ డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.డ్రైవరు నిద్ర మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మొగ్గయ్య


రెండు కార్లు ఢీ..  

తుర్కయంజాల్‌ పురపాలిక: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు  దుర్మరణం చెందిన సంఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా స్థంభంపల్లికి చెందిన బొల్లం ప్రణయ్‌కుమార్‌(29).. మీర్‌పేట్‌లోని నందిహిల్స్‌లో ఉంటున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా గుడిపాడు గ్రామానికి చెందిన కుంచాల రవీందర్‌బాబు(29) వనస్థలిపురంలోని ఎస్‌కేడీనగర్‌లో ఉంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. శుక్రవారం అర్ధరాత్రి  కారులో ఇబ్రహీంపట్నం మీదుగా.. బీఎన్‌రెడ్డినగర్‌ వైపు వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న మరోకారు.. గుర్రంగూడ వద్ద డివైడరును దాటి ఇవతలి వైపు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రణయ్‌కుమార్‌, రవీందర్‌బాబు అక్కడికక్కడే మృతిచెందారు.  


ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం

పటాన్‌చెరు అర్బన్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి డివైడర్‌పైకి ఎక్కి రోడ్డు దాటుతున్న కార్మికుడిని ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. పటాన్‌చెరు పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళుతున్న వెంకటరమణ ట్రావెల్స్‌ బస్సు శనివారం నోవాపాన్‌ కూడలి సమీపంలో   రోడ్డు దాటుతున్న కూలీ వనపర్తి జిల్లా రాజాపూర్‌కు చెందిన మహేష్‌ (20)ను ఢీకొంది.   బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయి దుర్మరణం చెందాడు. అనంతరం ద్విచక్రవాహనాన్ని, కారు, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనతో  ట్రాఫిక్‌ స్తంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని