logo

మహిళలపై హోంగార్డు దాడి

ఓ హోంగార్డు రౌడీలా మారాడు.. కర్రలు, ముష్టిఘాతాలతో మహిళలు, బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఏడునెలల గర్భిణినీ వదలకుండా కాలితో తన్నాడు.

Published : 16 Apr 2024 05:55 IST

నెలల గర్భిణిపైనా దాష్టీకం

కేశవగిరి, న్యూస్‌టుడే: ఓ హోంగార్డు రౌడీలా మారాడు.. కర్రలు, ముష్టిఘాతాలతో మహిళలు, బాలికపై దాడికి పాల్పడ్డాడు. ఏడునెలల గర్భిణినీ వదలకుండా కాలితో తన్నాడు. దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. ఆగ్రహించిన జనం తిరగబడి హోంగార్డును చితకబాదారు. ఈ ఘటన పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్‌ ఠాణాలో హోంగార్డుగా పనిచేస్తున్న మహ్మద్‌ ఇస్మాయిల్‌ సాదత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. స్థానికంగా నివసించే బిహార్‌కు చెందిన గుల్‌నాజ్‌ బేగం(ఏడు నెలల గర్భిణి) కూతురు పర్వీన్‌(5)తో ఇస్మాయిల్‌ కూతురు ఆయేషా(9)కు చిన్న గొడవ జరిగింది. ఆగ్రహించిన ఇస్మాయిల్‌ బిహార్‌కు చెందినవారుండే వీధిలోకి వెళ్లి మహిళలను నిలదీశాడు. ఫోన్‌ చేసి మరో ఐదుగురిని రప్పించి గర్భిణిని కాలితో తన్ని కొట్టాడు. అడ్డుకోబోయిన ఆమె బంధువులు సాజిదాబేగం(38), జాహిదాబేగం(40), అంజుమ్‌ ఖాతూన్‌(35)లపై దాడిచేశాడు. ఓ బాలిక వస్త్రాన్ని లాగి అవమానపర్చాడు. ఇస్మాయిల్‌ అతని అనుచరులు, కుటుంబ సభ్యుల దాడిని స్థానిక యువకులు చరవాణుల్లో చిత్రీకరించారు. ఇవి  వైరల్‌ అయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలో బస్తీలోని పలువురు యువకులు, మహిళలు ఇస్మాయిల్‌పై తిరగబడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయగా.. అప్పటికే కోపంతో రగిలిపోయిన స్థానికులు ఇస్మాయిల్‌ను చితకబాదారు. సాజిదాబేగం(38) ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు హోంగార్డు ఇస్మాయిల్‌, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్‌ భార్య సనా ఫాతిమా(28) తన భర్తను సాదిఖ్‌ అతని సోదరులు, ఇతరులు దాడిచేసి కొట్టారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని