logo

నీటి వృథా నివారణకు ముమ్మర తనిఖీలు

‘పడిపోతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని పరిగి పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం, నీటి వృథాను అరికట్టడంలో భాగంగా తనిఖీలు విస్తృతం చేశామని’ పరిగి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య తెలిపారు.

Published : 16 Apr 2024 05:59 IST

న్యూస్‌టుడే, పరిగి: ‘పడిపోతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని పరిగి పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం, నీటి వృథాను అరికట్టడంలో భాగంగా తనిఖీలు విస్తృతం చేశామని’ పరిగి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య తెలిపారు. ఎండలు ముదురుతున్న వేళ పరిగి పట్టణంలో ప్రజలు తాగునీటికి పడుతున్న అవస్థలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయమై ‘న్యూస్‌టుడే’ ఆయనతో ‘ముఖాముఖి’ నిర్వహించగా పలు విషయాలను తెలిపారు. ఆ వివరాలు..

న్యూస్‌టుడే: పట్టణంలో ఎద్దడి సమస్య తీవ్రమవుతోంది. ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు?

కమిషనర్‌: ఎద్దడి నివారణకు రూ.14.5లక్షలను వెచ్చిస్తున్నాం. సుమారు 20లక్షల లీటర్ల భగీరథ నీటితో పాటు మున్సిపాలిటీ పరిధిలో 66బోర్లు నిరంతరంగా పనిచేస్తున్నాయి. అవసరమైన చోట్ల పాత వాటిని మరమ్మతు చేస్తాం. పరిస్థితులు మరీ ఇబ్బందిగా మారితే కొత్తవి వేయిస్తాం. ఎప్పటికప్పుడు లీకేజీలను అరికట్టి వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

న్యూ: కొత్త కాలనీల సంగతేమిటి?

కమిషనర్‌: పరిగి మున్సిపాలిటీలో కొన్ని కాలనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాలకు నీటి సమస్య రాకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం.

న్యూ: పలుచోట్ల ఇంకా నీటి వృథా జరుగుతోంది కదా?

కమిషనర్‌: వివిధ చోట్ల కుళాయిల ద్వారా నీటి వృథాకు పాల్పడుతున్న 20 మందికి నోటీసులు జారీ చేశాం. లీకేజీలను గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తున్నాం.

న్యూ: పారిశుద్ధ్యం మెరుగుదలకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?

కమిషనర్‌: పట్టణంలో చెత్తదిబ్బ లేకపోవడంఅవరోధంగా మారింది.ప్రభుత్వం ఇందుకోసం 4 ఎకరాలను కేటాయించింది. స్థానికంగా ఉన్న సమస్య కొలిక్కి రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  

న్యూ: వర్షాకాలంలో ఇళ్లలోకి వరదనీరు రాకుండా ఏం చేయబోతున్నారు?

కమిషనర్‌: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే స్పెషల్‌ డ్రైవ్‌ చేపడుతున్నాం. ఈ క్రమంలోనే మురుగు కాల్వల్లోని చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగిస్తున్నాం.  కాల్వల్లో సాఫీగా నీరు పారితే సగం సమస్య తీరుతుంది.

న్యూ: వీధులు శుభ్రం చేసే యంత్రాలు వృథాగా పడి ఉన్నాయి. వాటిని ఎందుకు వినియోగించరు?  

కమిషనర్‌: నైపుణ్యం కలిగిన డ్రైవర్‌ లేకపోవడంతోనే సమస్య వచ్చింది. వాహనాలకు చిన్నచిన్న మరమ్మతు పనులు అవసరం ఉన్నాయి. అవి పూర్తిచేసి ప్రత్యేక శిక్షణ ఇప్పించి వినియోగంలోకి తీసుకువస్తాం.

న్యూ: పట్టణంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటిపై దృష్టి సారిస్తారా?  

కమిషనర్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపడుతున్నట్లు స్వయంగా వారే రాసి ఇస్తున్నారు. దీంతో ఆన్‌లైన్లో అనుమతులు లభిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలకు వారే బాధ్యులవుతారు. మావంతుగా పర్యవేక్షణ పెంచి అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని