logo

మందేసి మందిపైకి.. బ్రీత్‌అనలైజర్‌లో 550 రీడింగ్‌

పూటుగా మద్యం తాగిన ఓ యువకుడు ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.

Updated : 16 Apr 2024 07:51 IST

అర్ధరాత్రి కారుతో 6 రోడ్డు ప్రమాదాలు
ఒకరి దుర్మరణం.. 11 మందికి గాయాలు

ఈనాడు- హైదరాబాద్‌: పూటుగా మద్యం తాగిన ఓ యువకుడు ఐటీ కారిడార్‌లో అర్ధరాత్రి వేళ బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఇందులో ఓ యువకుడు మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు. ఐకియా నుంచి రాయదుర్గం ఠాణా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకూ ఈ వరుస రోడ్డు ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది.
పూటుగా మద్యం తాగి..:! : నగరంలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్‌ యాదవ్‌(30) ఆదివారం రాత్రి మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయల్దేరి ఐకియా రోటరీ దగ్గరికి చేరుకున్నాడు. ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ధ్వంసమైంది. అందులోని మహిళ స్వల్పంగా గాయపడ్డారు. నిందితుడు కారుతో పారిపోతూ గచ్చిబౌలి బాబూఖాన్‌ లేన్‌ దగ్గర బైక్‌ను ఢీకొట్టగా.. ఒకరి కాలు విరిగిపోగా.. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు మరింత వేగంగా పిస్తా హౌజ్‌ ఎదురుగా వెళ్తూ 20- 25 ఏళ్ల యువకుడిని ఢీకొట్టాడు. అతని వివరాలు బయటకు రాలేదు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మరో మూడు ప్రమాదాలు: ఓ వ్యక్తి మరణించినా కాంత్రి తన వాహనాన్ని ఆపలేదు. పారిపోతూ రాయదుర్గం ఠాణా సమీపంలోని కిమ్స్‌ ఆసుపత్రి దగ్గర మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. కొద్ది అడుగుల దూరంలో మరో బైక్‌ను ఢీకొట్టగా దానిపైనున్న ఇద్దరు యువకులు గాయపడ్డాడు. మరోసారి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిమ్స్‌ ఆసుపత్రి సమీపంలోని ఆటోను ఢీకొట్టగా ముగ్గురు గాయపడ్డారు. వరుస ప్రమాదాల్ని గమనించిన కొందరు వెంటాడి మల్కంచెరువు దగ్గర క్రాంతి వాహనాన్ని అడ్డుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు క్రాంతిని రాయదుర్గం ఠాణాకు తరలించి మద్యం పరీక్షలు నిర్వహించగా మీటరు రీడింగ్‌ 550 వచ్చినట్లు తేలింది. నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న కారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని