logo

హైదరాబాద్‌లో మధ్యాహ్నం సగం సిటీ బస్సులకు విశ్రాంతి

ఎండ బాగా ఉంది.. ద్విచక్రవాహనంలో ఏం వెళ్తాం.. బస్సులో వెళ్దామని నగరవాసులు అనుకుంటే.. ఎండలో మండిపోవాల్సిందే.

Updated : 16 Apr 2024 09:19 IST

ఖాళీగా తిప్పలేకనే నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌ : ఎండ బాగా ఉంది.. ద్విచక్రవాహనంలో ఏం వెళ్తాం.. బస్సులో వెళ్దామని నగరవాసులు అనుకుంటే.. ఎండలో మండిపోవాల్సిందే. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను తగ్గిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రమే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని  టీఎస్‌ఆర్టీసీ వివరణ ఇచ్చింది. ఎండలు బాగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మధ్యాహ్నం వేళ తప్పనిసరి కాకపోతే బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జోడించింది. మరోవైపు మంగళవారం నుంచి ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

పరిమితంగా సర్వీసులు

ఎన్ని బస్సులు, సర్వీసులు తగ్గిస్తున్నారనే విషయాన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ స్పష్టం చేయలేదు. ఇదే విషయమై ఓ అధికారిని అడగ్గా.. 5 నిమిషాలకో బస్సు ఉన్న చోట 10 నిమిషాలకొకటి నడుపుతారని తెలిపారు. అంటే 2550 బస్సులకు  1275 అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం 5 నుంచి మొత్తం బస్సులు ఉంటాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ పరిమితంగా.. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని