logo

ప్రయాణికులు ఫుల్‌.. ఎంఎంటీఎస్‌లు నిల్‌

ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు   పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు.

Updated : 17 Apr 2024 09:28 IST

సమయపాలన పాటించని లోకల్‌ రైళ్లు
స్టేషన్లలో ప్రయాణికుల పడిగాపులు

ఎంఎంటీఎస్‌లను ఎందుకు తగ్గించారు?

జీఎం: ప్రయాణికులు లేరు.. అందుకే సర్వీసులు కొన్ని రద్దు చేశాం.

సమయానికి నడపక ఎంఎంటీఎస్‌కు ప్రయాణికులు దూరమవుతున్నారు కదా?

జీఎం: సమయానికే నడుపుతున్నాం. కాకపోతే ప్రత్యామ్నాయ ప్రయాణ వనరుండడంతో వెళ్లిపోతున్నారు.

కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కిలోమీటర్లు ప్రయాణించే వెసులుబాటు ఎందుకు వదులుకుంటారు?

జీఎం: ప్రయాణికుల సంఖ్య పెరిగితే  సర్వీసులను పెంచుతాం.

ఇటీవల జరిగిన ప్రెస్‌మీట్‌లో విలేకరి అడిగిన ప్రశ్నలకు ద.మ. రైల్వే జీఎం సమాధానాలివి. ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్‌ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు   పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. రద్దీ లేని సమయాల్లో 12 బోగీలకు బదులు 9 బోగీలతో నడిపి సర్వీసులు పెంచితే బాగుంటుందని ప్రయాణికులు విన్నవించినా రైల్వే అధికారులకు పట్టడంలేదు.

స్టేషన్లలో టైమ్‌ టేబుల్‌ ఏదీ?

ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఒకప్పుడు రైళ్ల రాకపోకల సమయాల పట్టిక ఉండేది. ఇప్పుడు కనిపించడం లేదు. ప్రయాణికుల కష్టాలను తెలుసుకునేందుకు శనివారం హైటెక్‌సిటీ స్టేషన్‌కు వెళ్లి పరిశీలించగా సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 వరకు ఒక్క ఎంఎంటీఎస్‌ కూడా రాలేదని  వేచి చూస్తున్న వారు వాపోయారు. రాత్రి 7.45 గంటలకు ఒక రైలు రాగానే వందలాది మంది ఒక్కసారే ఎక్కేసరికి కిక్కిరిసిపోయింది.

దూరప్రాంతరైళ్లతోపాటు గూడ్స్‌కే ప్రాధాన్యం..

లోకల్‌ రైళ్లకు మొదటి ప్రాధాన్యమివ్వాలని రైల్వే బోర్డు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ముంబయిలో 2500 సర్వీసులుంటే 30 లక్షల మందికిపైగా ప్రయాణికుల కోసం 3 నిమిషాలకో లోకల్‌ రైలు పరుగులు పెడుతోంది. అక్కడ ప్రజారవాణా అంత బలంగా ఉంది. మన నగరంలో గతంలో అరగంటకో రైలొస్తే ఇప్పుడు రెండు గంటలకో రైలు వస్తోంది. దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లకు, గూడ్స్‌ రైళ్లకు ప్రాధాన్యమిచ్చి ఎంఎంటీఎస్‌లను ఆపేయడమే ప్రధాన కారణమని ఎంఎంటీఎస్‌ ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు చందు, సబర్బన్‌ ప్రయాణికుల సంఘ ప్రధాన కార్యదర్శి నూర్‌మహ్మద్‌ ఆరోపిస్తున్నారు. లింగంపల్లి - ఘట్‌కేసర్‌కు ఎంఎంటీఎస్‌ల డిమాండ్లున్నా కేవలం రెండు సర్వీసులే నడపడాన్ని తప్పుపడుతున్నారు. మేడ్చల్‌ - సికింద్రాబాద్‌ మధ్య కూడా కేవలం 10 సర్వీసులుండటమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని