logo

ఆపరేషన్‌ మల్కాజిగిరి

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.

Updated : 18 Apr 2024 07:26 IST

భాజపా, భారాస నాయకులపై కాంగ్రెస్‌ గురి

 

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీగా వ్యవహరించిన ఈ స్థానాన్ని ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గం కావడం.. 37.28 లక్షల ఓటర్లున్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్‌ రెడ్డిని లక్షకుపైగా మెజారిటీ గెలిపించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా భాజపా, భారాసల్లో అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకొని ఓటింగ్‌ శాతం పెంచుకోవాలని కార్యాచరణ రూపొందించారు. పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో భారాస, భాజపా నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు. మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతోపాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 పట్టణ ఓటర్లు, నాయకులే లక్ష్యం

పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కాంగ్రెస్‌ నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ను హస్తగతం చేసుకోగా... ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ పురపాలికల్లో నాయకులను చేర్చుకున్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పావనీ యాదవ్‌, మేడ్చల్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌లు ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. తాజాగా పిర్జాదీగూడ కార్పొరేషన్‌కు చెందిన పదిమంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికలోనూ విజయం లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జంపన ప్రతాప్‌ను పార్టీలో చేర్చుకున్నారు.

ఆ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి..

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 37.28లక్షల మంది ఓటర్లుండగా, 19.50లక్షల మంది కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల వారే. ఈ మూడుచోట్ల భారాస ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకుని మెజారిటీ ఓట్లు సాధించాలని భావిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ గూటికి చేరడంతో భాజపాకు నష్టం జరిగిందని అనుకుంటున్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గ భారాస నేత రామ్మోహన్‌గౌడ్‌ను పార్టీలోకి ఆహ్వానించడంతో భారాస ఓటుబ్యాంక్‌కు గండిపడినట్టేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. మరింతమంది భాజపా, భారాస నేతలను చేర్చుకుని భారీ మెజారిటీ సాధించాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని