logo

ఎక్కడిక్కడే నీటి శుద్ధి!

మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి.

Published : 19 Apr 2024 03:12 IST

మినీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు షురూ
ఉస్మాన్‌సాగర్‌ కాండూట్‌పై మూడు ఏర్పాటు
హిమాయత్‌సాగర్‌పై మరొకటి నిర్మాణానికి టెండర్లు

మినీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

ఈనాడు, హైదరాబాద్‌: మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగీర్‌, నానక్‌రాంగూడ తదితర శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇలాంటి ప్రాంతాలకు తాగునీటిని అందించడం పెద్ద సవాలు. దీంతో వీరు నీటికోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. 250- 300 ప్లాట్లు ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీలు ట్యాంకర్ల కోసమే నెలకు లక్షల్లో వెచ్చిస్తున్నారు. జలమండలితోపాటు ప్రైవేటు వ్యాపారులు వాటర్‌ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఎటూ సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలో మినీ నీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేసేందుకు జలమండలి ముందుకు వచ్చింది. ఉస్మాన్‌సాగర్‌- ఆసిఫ్‌నగర్‌ కాండూట్‌(నీటిని తరలించే కాలువ)పై మూడు ప్రాంతాలతోపాటు హిమాయత్‌సాగర్‌ పరిధిలోని బుద్వేల్‌ వద్ద మరొక నీటి శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తానున్నారు. ఈ మినీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల కోసం తాజాగా జలమండలి టెండర్లు పిలవగా 2నెలల్లో పనులు పూర్తి చేయనున్నారు. ఒక్కో కేంద్రాన్ని 3 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో చేపట్టేందుకు రూ.8 కోట్లు వెచ్చించనున్నారు.

ఎందుకు అవసరం అంటే...

  • ఉస్మాన్‌సాగర్‌ సామర్థ్యం 3.900 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 2.530 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హిమాయత్‌సాగర్‌ సామర్థ్యం 2.967 టీఎంసీలుండగా ప్రస్తుతం 2.080 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ రెండు జలాశయాల నుంచి రోజూ 121 మిలియన్‌ లీటర్ల నీటిని నగరానికి తరలిస్తున్నారు. నీటిని పంపింగ్‌ చేసి కాండూట్‌ ద్వారా ఆసిఫ్‌నగర్‌, మీరాలం ఫిల్టర్‌బెడ్స్‌లో శుద్ధి చేశాక నగరంలోని రిజర్వాయర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 
  • మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగీర్‌ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం తాగునీటి కొరతను దృష్టిలో పెట్టుకొని ఫిల్టర్‌బెడ్స్‌కు చేరకముందే మధ్యలోనే టాప్‌చేసి మినీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలిస్తారు. అక్కడ నీటిని శుద్ధి చేసి అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేయాలని జలమండలి తాజాగా నిర్ణయించింది. 
  • గతంలో మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో 2ఎంఎల్‌, 3ఎంఎల్‌ మినీ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నుంచి వచ్చేనీటిని ప్రస్తుతం ఇక్కడ శుద్ధి చేసి కొన్ని ప్రాంతాలకు అందిస్తున్నారు. 
  • అదనంగా మరో 4 కేంద్రాలు రానున్నాయి. వీటిద్వారా రోజూ 12 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధి చేసి పుప్పాలగూడ, మణికొండ, బండ్లగూడ జాగీర్‌లో ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 కింద నిర్మించిన రిజర్వాయర్లకు అందిస్తారు. అక్కడ నుంచి అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తారు. మరికొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా అందిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని