logo

రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ

సాయంత్రం దాటితే చాలు.. రేస్‌ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది.

Published : 19 Apr 2024 03:13 IST

పగలు రోడ్లు.. రాత్రిళ్లు రేస్‌ ట్రాకులు
రేసింగ్‌, మందుబాబుల డ్రైవింగ్‌తో ప్రమాదాలు
నగరంలో పెరుగుతున్న హిట్‌ అండ్‌ రన్‌ కేసులు

ఈనాడు- హైదరాబాద్‌: సాయంత్రం దాటితే చాలు.. రేస్‌ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఖరీదైన కార్లు, బైకులతో దూసుకెళ్లడం.. ఒళ్లు తెలియనంతలా తప్పతాగి బండి నడపడం వెరసి ఎప్పుడు ఏవైపు నుంచి ఏ వాహనం ఢీకొడుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మందుబాబుల డ్రైవింగ్‌ వాహనదారులు, పాదచారుల ప్రాణాల మీదకొస్తోంది. పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌లతో నిలువరిస్తున్నా కొందరు మాత్రం అడ్డదారుల్లో రహదారుల మీదకు దూసుకొస్తున్నారు. ఇటీవల రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐటీ ఉద్యోగి రహదారిపై బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.  ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నా నియంత్రించడం సాధ్యపడడం లేదు.

వారాంతాల్లో అమ్మో..  ఖాళీ రోడ్లపై ఆకతాయిలు, పోకిరీలు స్టంట్లుచేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటే.. వారాంతాల్లో మరింత దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం రేసింగ్‌లు, వేగంగా దూసుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్‌, నగరంలోని ఖాళీ రోడ్లపై ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ద్విచక్రవాహనాలపై రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల్ని పట్టుకున్నా.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కింద కేసు నమోదుకే పరిమితమవుతున్నారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలున్నా..

పోలీసులు వారాంతాల్లో తప్పనిసరిగా, మిగిలిన రోజుల్లో హఠాత్తుగా డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. ఇవీ నిర్ణీత సమయం వరకే ఉండటంతో తరువాత మందుబాబులు చెలరేగుతున్నారు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదాలకు ఇదీ ఓ కారణం. కొందరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ తనిఖీలున్నాయో సమాచారం ఇచ్చుకుంటున్నారని చెబుతున్నారు.

పబ్బుల దగ్గర లేని నియంత్రణ..

పబ్బులు, బార్లలో ఎవరైనా మద్యం అతిగా సేవిస్తే వారు వాహనాలు డ్రైవింగ్‌ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ డ్రైవరు వచ్చేదాకా వారిని నిలువరించడం లేదా క్యాబ్‌లో పంపాలి. ఇటీవల కొత్తఏడాది వేడుకల సందర్భంగానూ పోలీసులు పబ్బులు, బార్ల నిర్వాహకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదెక్కడా అమలవ్వడం లేదు. రాయదుర్గం రోడ్డు ప్రమాదంలో ఇదే పరిస్థితి. నిందితుడు ఆరు ప్రమాదాలకు కారణమైన యువకుడు సాయంత్రం తర్వాత ఓ పబ్బులో తాగాడు. పూర్తిగా నియంత్రణ కోల్పోయిన స్థితిలో డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు చేశాడు.

దుర్గం చెరువుపై వింత పరిస్థితి

దుర్గం చెరువు తీగల వంతెనపై వాహనదారుల తీరుతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించే విధుల్లో ఉంచిన ట్రాఫిక్‌ పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. విధుల్లో ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లకు బ్రిడ్జి పొడవునా ఫొటోలు దిగే సందర్శకుల్ని నియంత్రించడం సాధ్యపడటం లేదు. ముఖ్యంగా మహిళలు వారించినా వినకుండా అసౌకర్యం కల్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల బ్రిడ్జిపై హిట్‌ రండ్‌ అన్‌ కేసు నేపథ్యంలో మాదాపూర్‌ పోలీసులు కవాతు నిర్వహిస్తూ అవగాహన కల్పించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. అడపాదడపా రోడ్డు మీద వాహనాలు నిలిపి సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని