logo

పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..

శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది.

Updated : 19 Apr 2024 04:33 IST

గ్రేటర్‌ పరిధిలో విజయానికి కాంగ్రెస్‌ వ్యూహాలు
ఈనాడు, హైదరాబాద్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. రాజధాని పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. నాలుగింటి పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌కు ఉన్నారు.

నిరాశాజనకంగా ఫలితాలు..గత కొన్నేళ్లుగా రాజధానిలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించినా రాజధాని పరిధిలో కేవలం మూడు స్థానాల్లోనే గెలుపొందారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోవడం గమనార్హం. చేవెళ్ల పరిధిలో వికరాబాద్‌, పరిగి, తాండూరులో ఎమ్మెల్యేలు ఉన్నారు.

చేరికలపై దృష్టి.. కొద్దిరోజులుగా భారాస నుంచి ఎమ్మెల్యేలను, స్థానిక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై దృష్టిసారించింది. మూడు లోక్‌సభ స్థానాల అభ్యుర్థులు దానం, రంజిత్‌రెడ్డి, సునీతారెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. ఇలా ఆ పార్టీ పొరుగు నేతలపైనే ఆధారపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నేతల మధ్య సమన్వయం పెరిగితేనే....

గ్రేటర్‌ పరిధిలోని అయిదుగురు భారాస ఎమ్మెల్యేలు, పది మంది హైదరాబాద్‌ కార్పొరేటర్లతోపాటు శివార్లలోని పురపాలక, నగరపాలక సంస్థల ప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్‌ దృష్టిసారించింది. దీంతో పార్టీ నగర పరిధిలో బలపడినా కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లోపిస్తోంది. విషయం సీఎం రేవంత్‌రెడ్డి వరకు వెళ్లడంతో ఇప్పటికే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు నిర్వహించారు.

అభ్యర్థుల తీరిది!

  • సికింద్రాబాద్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఇప్పటివరకు ఆరుసార్లు గెల్చారు. మిగిలిన నియోజకవర్గాలపై ఆయనకు పట్టులేకున్నా బీసీ నేతగా దానం వర్గం ఓటర్లు అధికంగా ఉండటంతో గెలుపు నల్లేరుమీద నడకేనని చెబుతున్నారు. మొన్నటివరకు ఆయన ప్రచారంలో చురుగ్గా పాల్గొనలేదు. కొద్దిరోజులుగా నియోజకవర్గాల సమన్వయ సమావేశాలకు హాజరవుతున్నారు.
  • చేవెళ్ల అభ్యర్థిగా భారాస సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచారు. ఈసారీ అతనే పోటీ చేస్తారని భారాస ప్రకటించినా.. తరువాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌లో చేరడం.. ఆ పార్టీ నుంచి టికెట్‌ ప్రకటించడం ఒకేసారి జరిగిపోయాయి. సిట్టింగ్‌ ఎంపీ కావడంతో అక్కడి నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండటం కలిసొచ్చే అంశమని అంటున్నారు.
  • మల్కాగిజిరి అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆమె భర్త మహేందర్‌రెడ్డి భారాస ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలతో సునీతా మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండుసార్లు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేశారు. ప్రస్తుతం వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఆమెకు నేతలతో పట్టు ఉంది.
  • హైదరాబాద్‌ స్థానానికి ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సమీర్‌ వాలీ ఉల్లాను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు పాతబస్తీపై కొంతవరకు పట్టు ఉంది. ఎంఐఎంను తట్టుకుని ఆయన నిలబడతారా అన్నది ప్రశ్నార్థకమే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని