logo

పర్యవేక్షణ శూన్యం.. ట్యాంకులు అధ్వానం

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకోసం పంచాయతీ మొదలు మున్సిపాలిటీల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి.

Published : 21 Apr 2024 02:46 IST

తాండూరులో మరమ్మతులకు ఎదురుచూస్తున్న ట్యాంకులు

న్యూస్‌టుడే, పరిగి, తాండూరు: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. ఇందుకోసం పంచాయతీ మొదలు మున్సిపాలిటీల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కానీ ఈ పరిస్థితి జిల్లాలో కానరావడంలేదు. ఫలితంగా ప్రజలకు ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఉచితంగా సరఫరా చేసున్న తాగునీరు గొంత తడపలేకపోతోంది. ప్రజలు తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

గాడి తప్పుతున్న భగీరథ లక్ష్యం

జిల్లాలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్‌ భగీరథ పథకాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు.

  • పరిగి, వికారాబాద్‌, తాండూరు మున్సిపాలిటీల పరిధిలోని 974 గ్రామాలకు పరిగి మండలం రాఘవాపూర్‌ సమీపంలోని నీటిశుద్ధి కేంద్రం నుంచి భగీరథ నీటి సరఫరా జరుగుతోంది. కనీసం ప్రతి పదిహేను రోజులకోసారి ట్యాంకులను శుభ్రం చేయాలి. పంచాయతీల్లో సిబ్బంది కొరత, కార్యదర్శులు పట్టించుకోకపోవడంతో నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది.
  • సమయానుకూలంగా శుభం చేయకపోవడం, క్లోరినేషన్‌ పూర్తిగా మరిచిపోవడంతో తాగేనీటిలో చెత్తా చెదారంతో పాటు నాచు వస్తోందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి కావడంతో ట్యాంకుల శుభ్రత తప్పసరి అని స్వయంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులే చెబుతున్నారు. అయినా కార్యదర్శులు తగినంత దృష్టి సారించడం లేదన్న విమర్శలొస్తున్నాయి.  
  • ప్రభుత్వం భగీరథ నీటి విషయంలో సందేహాలు వద్దని చెబుతోంది. కానీ శుభ్రత విషయంలో ఆందోళనతో  చాలా మంది ఆ నీటిని తాగడానికి ముందుకు రావడంలేదు. ఇళ్ల శుభ్రతకు, దుస్తులు ఉతకడానికి తదితర అవసరాలకు ఎక్కువగా వాడుతున్నారు.

శుభ్రం చేసే తేదీలను రాయాల్సిన బోర్డు


కొన్నిచోట్ల నెలకు.. మరికొన్ని చోట్ల రెండు నెలలకోసారి

  • తాండూరులో తాగునీటి సరఫరా ట్యాంకుల పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల నెలకు, మరికొన్నినెలకో..రెండు నెలలకోసారి శుభ్రం చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో శుభ్రత లోపించిన నీటిని తాగితే వ్యాధుల బారిన పడే వీలుంది. ట్యాంకులను ఎప్పుడు శుభ్రం చేసింది? తిరిగి మళ్లీ ఎపుడు శుభ్రం చేయాలనే విషయంలో ప్రత్యేకంగా నామఫలకంపై రాయాలి. కానీ దీన్ని ఎవరూ పట్టించు కోవడం లేదు.
  • తాండూరు పట్టణంలో 71వేల మంది జనాభాకు తాగునీటిని సరఫరా చేసే 8 ట్యాంకులు ఉన్నాయి. వీటి నుంచి 9 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నా అనేకచోట్ల శుభ్రత కానరావడంలేదు.  
  • వికారాబాద్‌ మున్సిపల్‌ డివిజన్లో ట్యాంకుల శుభ్రత మరిచిపోయారు. ట్యాం కులు పాతవి కావడం, పర్యవేక్షణ లోపం ఫలితంగా పలుచోట్ల మట్టి, వాసనతో కూడిన నీరు సరఫరా అవుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న ఎండలను, తాగునీటి అవస్థలను దృష్టిలో పెట్టుకునైనా ట్యాంకుల శుభ్రత చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.  

మిషన్‌ భగీరథ పథకం ప్రారంభం...2018
వెచ్చించిన మొత్తం.. రూ.402 కోట్లు
ట్యాంకుల నిర్మాణం.. 402
పైప్‌లైన్‌ల ఏర్పాటు..1920 కి.మీ.
కుళాయి కనెక్షన్లు.. 1.98 లక్షలు
ప్రస్తుతం ట్యాంకుల శుభ్రత.. 40 శాతం లోపే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని