logo

అధిక వడ్డీలు, అప్పులోళ్ల వేధింపులతోనే ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రాకేష్‌ కిరణ్‌ ఘటనకు ఒకరోజు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. అధిక వడ్డీలతో అప్పులవాళ్లు తనను వేధిస్తూ మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారంటూ సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో బాధితుడు ఈ వీడియో తీసుకున్నాడు.

Updated : 21 Apr 2024 06:19 IST

వైరల్‌గా మారిన బాధితుడు రాకేష్‌ కిరణ్‌ సెల్ఫీ వీడియో

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రాకేష్‌ కిరణ్‌ ఘటనకు ఒకరోజు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. అధిక వడ్డీలతో అప్పులవాళ్లు తనను వేధిస్తూ మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారంటూ సనత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలో బాధితుడు ఈ వీడియో తీసుకున్నాడు. సనత్‌నగర్‌లోని ఎస్సార్టీ కాలనీకి చెందిన రాకేష్‌ కిరణ్‌(37) శుక్రవారం రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే. అతడి సెల్ఫీవీడియో శనివారం వెలుగు చూసింది. రైలుపట్టాలపై నడుస్తూ బాధితుడు దీన్ని తీసుకున్నాడు. శివ, మహేష్‌, అల్కేష్‌, రోషన్‌ల పేరు ప్రస్తావిస్తూ తన వద్ద 10, 15, 20 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేశారని, డబ్బు కోసం వేధించడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఖలీమ్‌ ఇంటికే వచ్చి టార్చర్‌ చేయడం ఏమీ బాగోలేదన్నాడు. శిల్ప బ్యాచ్‌ తన నుంచి పది రూపాయల చొప్పున వడ్డీ కట్టించుకున్నారన్నాడు. స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు గడించేవాడినని, రోజుకు రూ.2 లక్షలు సంపాదించే తనను ఈ స్థితికి దిగజార్చారని భావోద్వేగంతో పేర్కొన్నాడు. రైలు పట్టాల సమీపంలోకి ఆత్మహత్య కోసమే వెళ్లిన రాకేష్‌ ధైర్యం చాలక ఇంటికి తిరిగి వచ్చి, మరుసటి రోజు రసాయన ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అతడి సెల్ఫీ వీడియోను మిత్రులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వైరల్‌గా మారింది. శనివారం రాకేష్‌ కిరణ్‌ భౌతిక కాయాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధిక వడ్డీలతో రుణాలు ఇచ్చినవారు వేధించడం వల్లే రాకేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని