logo

పీపుల్స్‌ మేనిఫెస్టో చూడండి.. ఓటు అడగండి

ఓటింగ్‌ శాతం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న కాలనీ సంక్షేమ సంఘాలు ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ను రూపొందిస్తున్నాయి. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏళ్లుగాఉన్న పెండింగ్‌ సమస్యల వివరాలను అందులో పొందుపరుస్తున్నాయి.

Updated : 21 Apr 2024 06:23 IST

కాలనీ సంక్షేమ సంఘాల డిమాండ్‌ 

డిమాండ్లను తెలుపుతున్న కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: ఓటింగ్‌ శాతం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న కాలనీ సంక్షేమ సంఘాలు ‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ను రూపొందిస్తున్నాయి. నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏళ్లుగాఉన్న పెండింగ్‌ సమస్యల వివరాలను అందులో పొందుపరుస్తున్నాయి. ఓటు అడగడానికి వచ్చే ప్రతి అభ్యర్థి..ఈ మేనిఫెస్టో ఇచ్చి, వారు ఇచ్చిన సమాధానాలకు అనుగుణంగా ఎవరికి ఓటు వేయాలో జనరల్‌బాడీ మీటింగ్‌లో నిర్ణయిస్తామని చెబుతున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలపై నాయకులు అవగాహనతో వస్తేనే ఓట్లు పడతాయని చెప్పకనే చెబుతున్నారు.

సమస్యలు ఇవే... సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధానంగా ఆర్‌వోబీ, ఆర్‌యూబీ సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదు. సఫిల్‌గూడ, సికింద్రాబాద్‌, ఈస్ట్‌మారేడ్‌పల్లి, వెస్ట్‌మారేడ్‌పల్లి, కంటోన్మెంట్‌ తదితర ప్రాంతాల్లో తరచూ రోడ్ల మూసివేతతో స్థానికులు ఇబ్బందులు పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయని కాలనీ సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. అదనపు రైళ్లు, రైల్వే క్రాసింగ్‌లు, వంతెనల నిర్మాణం తదితర డిమాండ్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నియోజకవర్గంలో కాలిబాట ప్రాజెక్టు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, ఉమెన్‌ వేస్ట్‌, పారిశుద్ధ్యం తదితరాలకు నిధుల మంజూరు.. చేవెళ్ల నియోజకవర్గంతోపాటు మిగిలిన నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్‌ యోజన, సడక్‌ యోజన తదితరాలకు నిధుల మంజూరు.. ఉజ్వల స్కీమ్‌ అమలు తదితరాలపై ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారని పరిశీలించనున్నారు.  

ఓట్‌ ఛాలెంజ్‌...

ఓటింగ్‌ శాతం పెంచేందుకు సైతం ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటేసేందుకు ఎవరూ బద్దకించకుండా ‘ఓట్‌ ఛాలెంజ్‌’ ఇవ్వాలని సూచిస్తున్నారు. కుటుంబంతో కలిసి ఓటేసి వచ్చి సిరా చూపుతూ వాట్సప్‌ గ్రూపులో పోస్ట్‌ చేసి అందులో ఓటేయని వారికి ఛాలెంజ్‌ విసరాలని చెబుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ఓటేసే అవకాశముందంటున్నారు. పది రోజుల ముందుగానే వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌ ఏర్పాటుచేసుకొని పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉంది అనే అంశాలను పరిశీలించుకోవాలని, అవగాహన లేకపోతే బూత్‌ లెవెల్‌ అధికారి(బీఎల్‌వో)తో సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు వాట్సప్‌ గ్రూపులో సమాచారం చేరవేయనున్నారు. కుటుంబంతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి ముందురోజు వెళ్లి చూసిరావాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని