logo

నగరానికి అదనంగా 175 ఎంఎల్‌డీల నీళ్లు

నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జలమండలి అత్యవసర చర్యలు చేపడుతోంది. విడతల వారీగా ప్రస్తుత సరఫరాకు అదనంగా మరో 175 ఎంఎల్‌డీల నీటిని తరలించనున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Updated : 21 Apr 2024 06:18 IST

విడతల వారీగా అన్ని జలాశయాల నుంచి పెంపు
సాగర్‌లో ప్రారంభమైన అత్యవసర పంపింగ్‌

పంపింగ్‌ను పరిశీలిస్తున్న జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి, ఈడీ సత్యనారాయణ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో జలమండలి అత్యవసర చర్యలు చేపడుతోంది. విడతల వారీగా ప్రస్తుత సరఫరాకు అదనంగా మరో 175 ఎంఎల్‌డీల నీటిని తరలించనున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం నాగార్జున్‌సాగర్‌లోని అత్యవసర పంపింగ్‌ను ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా నీటి తరలింపులో ఎలాంటి ఆటంకం లేకుండా అత్యవసర పంపింగ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం పది పంపుల ద్వారా 600 క్యూసెక్కుల నీటిని ఏఎమ్మార్పీ అప్రోచ్‌ ఛానెల్‌లోకి ఎత్తి పోస్తున్నారు. 2017లో వర్షాభావంతో సాగర్‌లో నీటి మట్టం తగ్గడంతో అప్పట్లో ఇలానే అత్యవసర పంపింగ్‌ ఏర్పాటు చేశారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత అలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎండీ  వివరించారు. అదేవిధంగా గోదావరి నుంచి జలాల తరలింపులో ఆటంకం లేకుండా మే 15 తర్వాత ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో కూడా అత్యవసర పంపింగ్‌ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీటితోపాటు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని.. రాజధాని తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందిలేదని ఎండీ స్పష్టం చేశారు. అత్యవసరమైతే రెండోదశ అత్యవసర పంపింగ్‌ చేపడతామని చెప్పారు.

గతం కంటే సరఫరా పెంపు... ప్రస్తుతం నగరానికి నిత్యం 2600 మి.లీ.ల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గతేడాదితో పోల్చితే 175 ఎంఎల్‌డీలు అదనంగా సరఫరా చేస్తున్నామన్నారు. బోర్లు ఎండిపోయిన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు వివరించారు. వచ్చే నెల 15 నుంచి హిమాయత్‌సాగర్‌ నుంచి అదనంగా 30 ఎంఎల్‌డీలు, ఉస్మాన్‌సాగర్‌ నుంచి మేలో 12 ఎంఎల్‌డీలు అదనంగా సరఫరా చేస్తామని ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడీ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, టెక్నికల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌, ప్రాజెక్టు డైరెక్టర్‌-2 సుదర్శన్‌, ట్రాన్స్‌మిషన్‌ సీజీఎం దశరథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని