logo

యువతా.. నీ చేతిలోనే భవిత

ఓటరు కార్డు తీసుకుని కూడా.. మెజార్టీ కొత్త ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఇటీవల ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కావొద్దన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Updated : 21 Apr 2024 06:18 IST

మొత్తం జాబితాలో 18-39 ఏళ్ల వారు 21.62 లక్షల మంది
కొత్త ఓటర్లు కదిలితేనే పోలింగ్‌ శాతం పెరుగుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఓటరు కార్డు తీసుకుని కూడా.. మెజార్టీ కొత్త ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఇటీవల ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పరిస్థితి పునరావృతం కావొద్దన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కొత్త ఓటర్లందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వడం, వారు తప్పక ఓటు హక్కు ఉపయోగించుకునేలా బీఎల్‌ఓ (బూత్‌ స్థాయి అధికారి)లతో ఇంటింటి ప్రచారం, పోలింగ్‌ రోజు యువ ఉద్యోగులతో నడిచే పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం.. వంటి పలు చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

విస్తృతంగా అవగాహన..

పార్లమెంటు సభ్యులను ఎన్నుకునే బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత కొత్త ఓటర్లదే. ఉజ్వల భవిష్యత్తు కోసం నచ్చిన నాయకుడికి తప్పక ఓటేయాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిస్తోంది. గతానుభవాలను చూస్తే.. జీహెచ్‌ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లు పెద్దగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలింగ్‌ రోజు సెలవు దినంగా భావించడం, క్యూ చూసి ఇంటికెళ్లడం, ఓటు వేయడాన్ని భారంగా భావించడం.. తదితర కారణాలతో నగరంలో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవుతోందని అధికారులు  విశ్లేషిస్తున్నారు. వారిలోని అపోహలను తొలగించేందుకు ఈసారి పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, జిల్లా  ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ చెబుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించేలా పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

48 శాతం యువతీయువకులే..

హైదరాబాద్‌ జిల్లాలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం పరిధిలో మొత్తం 45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1.4 శాతం మంది కొత్త ఓటర్లే. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 16.37 శాతం మంది, 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఓటర్లు 30 శాతం మంది ఉన్నారు. అంతా కలిపితే 39 ఏళ్ల లోపు ఓటర్లు దాదాపు 48 శాతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని